SGSTV NEWS
CrimeTelangana

Telangana: పద్ధతికి ప్యాంటు, షర్టు వేసినట్లు ఉన్నాడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే దిమ్మతిరుగుద్ది



శంకర్‌పల్లిలో 6 ఎకరాలు, కరీంనగర్‌లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌ శివార్లలో ఒక విల్లా, 4 ఫ్లాట్లు, కిలో బంగారం, 80 లక్షల మేర బ్యాంకు బ్యాలెన్సు..! 50 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖలో పట్టుబడ్డ ఓ చిరుద్యోగి దగ్గర దొరికిన అంతులేని సంపద ఇది. వాసనొచ్చి గాలమేసి పట్టుకుంటే.. ఇటువంటి తిమింగలాలు తెలంగాణలో లెక్కలేనన్ని. మా ట్రాప్‌లో చిక్కిన సొరచేపల లిస్ట్ ఇదీ అని బైటపెట్టింది ఏసీబీ.

నూనె శ్రీధర్ ఎపిసోడ్ తెలంగాణలో ఒక కేస్‌ స్టడీ మాత్రమే. నూనె శ్రీధర్ లాంటి టార్చ్‌బేరర్లను స్పూర్తిగా తీసుకుని చిన్నాపెద్దా లంచగొండులంతా చెలరేగిపోతున్నారు. చీమూ నెత్తురు లేకుండా పైసావసూల్‌కి పాల్పడుతున్నారు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గజ్వేల్ ప్రాంత ఈఎన్‌సీగా పనిచేసిన హరిరామ్‌ కూడా ఏసీబీ ట్రాప్‌లో పడ్డ శాల్తీనే. షేక్‌పేట్‌లోని ఆయనింట్లో తనిఖీలు చేస్తే నోట్ల కట్టలు బైటపడ్డాయి. 50 వేలు తీసుకుంటూ గచ్చిబౌలిలో పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఏడీఈ సతీష్‌ మీద దాడులు చేస్తే వంద కోట్ల దాకా ఆస్తులు వెలుగు చూశాయి. మూడు నెలల సెలవు తర్వాత మళ్లీ డ్యూటీలో చేరడానికి అనుమతి కావాలని ఒక టీచర్ వేడుకుంటే 20 వేలిచ్చుకుంటేనే సంతకం పెడతానన్న ములుగు డీఈవో..!

నీ ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకో నా అకౌంట్లో 8 లక్షలు పడెయ్యి చాలు అని తర్వాత 4లక్షలతో సరిపెట్టుకుని త్యాగమూర్తిగా ఫోజుకొట్టిన సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్ విఠల్‌రావు…! 2 లక్షలు తీసుకుంటూ దొరికిన షామీర్‌పేట ఎస్‌ఐ, కాప్రా జీహెచ్‌ఎంసీ ఇంజనీర్ స్వరూప.. ఇలా చెప్పుకుంటూ పోతే తినమరిగిన తిమింగళాల జాబితా తెలంగాణలో చాలా పెద్దదే ఉంది.

తెలంగాణలో దూకుడు పెంచిన అవినీతి నిరోధక శాఖ ఆ మేరకు ఫలితాల్ని కూడా రాబట్టుకుంది. ఏసీబీ వలలో చిక్కుకుంటున్న అధికారులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత ఏడాది మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదైతే.. ఈ ఏడాది ఆ రికార్డు బద్దలయ్యేలా ఉంది. మొదటి ఆరు నెలల్లోనే మొత్తం 122 ట్రాప్ కేసులు నమోదయ్యాయి. అంటే, నెలకు సగటున 20 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ దొరికిపోతున్నారన్నమాట. కేసుల సంఖ్య అలా ఉంచితే.. ఈ ఆరు నెలల్లో పట్టుబడ్డ ప్రభుత్వ అధికారుల సంఖ్య 100 దాటి పోయింది. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ అన్ని సెక్షన్లలోనూ అన్ని డిపార్టుమెంట్స్‌లోనూ నీతిమాలిన ఉద్యోగులు ఉంటూనే ఉన్నారన్నమాట. చేతులు తడపందే పని కావడం లేదని మనం బైట వాపోవడం కాదు.. సర్కారీ కార్యాలయాల్లో కళ్లకు కడుతున్న వాస్తవం అది.


ఏసీబీ ట్రాప్‌లో ప్రతి మూడు రోజులకు ఇద్దరు చొప్పున ప్రభుత్వ అధికారులు దొరికిపోతున్నారు. దొరికిన దొంగలు సరే దొరకని దొంగల సంగతేంటి..? అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నా.. క్షేత్రస్థాయిలో సర్కారీ ఉద్యోగుల బుద్ధులు మారడం లేదు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ లంచాలు మరగడం.. ఒక సామాజిక రోగం. ఇది రోజురోజుకూ ముదురుతూనే ఉంది. లంచం తీసుకోవడం తప్పు.. లంచం ఇవ్వడం కూడా తప్పే..! ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే తప్ప ఈ కక్కుర్తి రోగం తగ్గదు మరి.

Also read

Related posts

Share this