February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: విద్యార్ధులతో స్కూల్లోనే కారు కడిగించిన టీచరమ్మ.. ఊహించని షాకిచ్చిన కలెక్టర్‌!



మండుటెండలో విద్యార్ధులతో స్కూల్‌ ఆవరణలోనే కారు కడిగించిన పంతులమ్మకు జిల్లా కలెక్టర్‌ ఊహించని షాక్‌ ఇచ్చారు. సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు పంతులమ్మతోపాటు ముగ్గురు విద్యార్ధులు స్కూల్లో కారును కడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..


రంగంపేట, ఫిబ్రవరి 2: బడిలో విద్యార్ధులు పాఠాలు చెప్పి, విద్యా బుద్ధులు నేర్పించవల్సిన ఓ టీచరమ్మ.. పిల్లలతో సొంత పనులు చేయించసాగింది. బడికి కారులో వచ్చిన పంతులమ్మ.. కారును కడగాలని విద్యార్ధులను పురమాయించింది. దీంతో కారు కడగకపోతే టీచర్ కొడుతుందేమోనన్న భయంతో ఎండలో టీచర్‌ కారును కడగసాగారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో సదరు టీచర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ సంఘటన తూర్పు గోదావరిలోని రంగంపేట మండలం వెంకటాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..


రంగంపేట మండలం వెంకటాపురం ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయిని (స్కూల్‌ అసిస్టెంట్‌) డి సుశీల తన కారును పాఠశాల ఆవరణలో విద్యార్థినులతో కడిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ వీడియోలో ముగ్గురు విద్యార్థినులతో పాటు సదరు టీచర్‌ కూడా కారును శుభ్రం చేస్తుండటం కనిపించింది. దీనిపై సర్వత్రా చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఎంఈవో-2 మధుసూదన్‌రావు సదరు అంశంపై విచారించి, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్‌ పి ప్రశాంతి వెంకటాపురం ఎంపీయూపీ పాఠశాల టీచర్‌ డి సుశీలను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె ఎంఈవో కె.శ్రీనివాసరావు, ఎంఈవో-2 మధుసూదనరావును సదరు పాఠశాలకు వెళ్లి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. వారు శనివారం పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కారు శుభ్రతతోపాటు ఇతర వ్యక్తిగత పనులు విద్యార్థులతో చేయించినట్లు వచ్చిన అభియోగాలు నిజమేనని తేలింది. దీంతో నిబంధనలకు లోబడి మహిళా టీచర్‌ డి సుశీలను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పాఠశాల విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు

Also read

Related posts

Share via