ఆధార్ కార్డు లేదని.. ఆసుపత్రికి తీసుకెళ్లక..
తాండూరు టౌన్, దౌల్తాబాద్ : రాత్రి సమయం.. ఒక నిరుపేద బాలికను పాము కాటేసింది. ఫోన్ చేస్తే 108 అంబులెన్సు వచ్చింది. కానీ ఆధార్ కార్డు లేదని.. అంబులెన్సు సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండలం నందారంలో సంచార కుటుంబానికి చెందిన బుడగ జంగం సంగీత (17), దివ్యాంగురాలైన ఆమె తల్లి రంగమ్మలు భిక్షాటన, కూలిపనులతో జీవిస్తూ.. గ్రామంలోని ఓ పాత భవనంలో నివసిస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు భోజనం అనంతరం పక్కనే ఉన్న గోడ మీద సంగీత చేయి పెట్టగా.. అక్కడే ఉన్న పాము కాటేసింది. ఆమె పెద్దగా అరిచి తల్లికి చెప్పడంతో చుట్టుపక్కల వారి సాయంతో 108కి సమాచారమిచ్చారు. అంబులెన్సు 10.30 గంటలకు వచ్చింది. తల్లి వెంట రాగా.. సంగీతను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తాండూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చికిత్స చేసినా పరిస్థి కుదుటపడలేదు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో రంగమ్మ స్థానికుల సహాయంతో మరో 108 అంబులెన్సుకు సమాచారమిచ్చారు. దాదాపు గంట తరువాత వాహనం వచ్చింది. హైదరాబాద్ ప్రభుత్వాసుపత్రుల్లో ఆధార్ కార్డు లేనిదే చేర్చుకోరని 108 సిబ్బంది ఆమెకు చెప్పారు. ఆత్రుతలో వచ్చినందున కార్డు తీసుకురాలేదని చెప్పగా అది తెస్తే అంబులెన్సులో తీసుకెళ్తామంటూ సిబ్బంది కొద్దిసేపు వేచి చూశారు. స్థానికులు నచ్చజెప్పినా సిబ్బంది అనుమతించలేదు. ఇంతలో సంగీత పరిస్థితి విషమించి అక్కడే ప్రాణాలు వదిలింది. తన బిడ్డ మృతికి అంబులెన్సు సిబ్బందే కారణమంటూ రంగమ్మ విలపించింది.
Also Read
- చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
- పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో కలిసి..
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!





