December 18, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొడుకు.. వెతగ్గా

నాన్న ఇక లేడన్న విషయాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఇన్నాళ్లు తనతో ముచ్చట్లు చెప్పిన నాన్న స్వరం మూగబోయేసరికి వేదనకు గురయ్యాడు. ఓ వైపు తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు…


అమ్మానాన్నలు అంటే అందరికీ ఇష్టమే. కానీ కొందరు మాత్రం తల్లిదండ్రులతో విపరీతమైన బాండింగ్ కలిగి ఉంటారు. వారితో ఉన్న మమకారాన్ని కొందరు తెంచుకోలేరు. అలాంటి ఓ తనయుడు.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించాడు. ఓ వైపు తండ్రి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది.

యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కాటం రాములుకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఉన్నంతలో వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. రాములు(75) అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. చిన్న కుమారుడు శ్రీశైలం(40)కు పెళ్లి కాలేదు. ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి రాములు అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతిచెందాడు. తండ్రి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం స్వగ్రామంలో నిర్వహించేందుకు బంధువులు ఏర్పాటు చేస్తున్నారు. తండ్రి మరణంతో శ్రీశైలం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడాన్ని తట్టుకోలేకపోయాడు. ఓవైపు తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, శ్రీశైలం ఇంట్లోనుంచి బయటికి వెళ్లిపోయాడు. ఇంటి వద్ద శ్రీశైలం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులంతా చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా శ్రీశైలం జాడ కనిపించలేదు. తమ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రీకుమారులిద్దరి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తండ్రీకుమారుల అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రీ కొడుకుల మరణం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

Also Read

Related posts

Share via