February 4, 2025
SGSTV NEWS
Hindu Temple History

కర్ణుడు బంగారం దానం చేసిన ఆలయం.. కంటి జబ్బులు నయం అవుతాయనే నమ్మకం.. ఎక్కడంటే..



బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఉన్న చండికా దేవి ఆలయం భారతదేశంలోని ప్రధాన శక్తిపీఠాలలో ఒకటి. సతీ దేవి ఎడమ కన్ను ఇక్కడ పడిందని ప్రతీతి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ ఆలయ చరిత్ర మహాభారత కాలానికి సంబంధించినది.


ముంగేర్‌లోని చండికా దేవి ఆలయం బీహార్‌లోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం దుర్గాదేవి దేవి అవతారమైన చండికా రూపానికి అంకితం చేయబడింది. ఈ ప్రదేశం హిందువుల విశ్వాసాలకు కేంద్రంగా మాత్రమే కాదు చారిత్రక, సాంస్కృతిక దృక్కోణంలో కూడా ముఖ్యమైనది. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఉన్న చండికా దేవి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ ఆలయం దేశంలోని 52 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడే దాన కర్ణుడు ప్రతిరోజు పావు వంతు బంగారాన్ని దానం చేసేవాడని చండికా దేవి ఆలయం గురించి ఒక నమ్మకం. ఈ ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం.


చండికా దేవి ఆలయ ప్రాముఖ్యత
చండికా ప్రదేశం ఒక ప్రసిద్ధ శక్తిపీఠం. సతీ దేవి శరీర భాగాలు పడిపోయిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ఏర్పడినట్లు నమ్మకం. సతీ దేవి ఎడమ కన్ను ఇక్కడ పడిందని ప్రతీతి. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటే కంటి జబ్బులతో బాధపడేవారి రోగాలు నయమవుతాయని నమ్ముతారు. అందుకే కంటి జబ్బులతో బాధపడేవారు ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి పూజలు చేస్తారు. ఈ ఆలయం దుర్గాదేవి భయంకరమైన, శక్తివంతమైన రూపమైన చండికా దేవి ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. హృదయపూర్వకంగా అమ్మవారిని పూజించిన భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఈ ఆలయం అద్భుతమైన శక్తులతో ప్రసిద్ధి చెందింది. నవరాత్రులలో ఇక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

చండికా దేవి ఆలయానికి సంబంధించిన దాత కర్ణుని కథ
పురాణాల కథల ప్రకారం దాన కర్ణుడు చండికా దేవికి గొప్ప భక్తుడు. అడిగిన వారికి లేదు అనకుండా ఇచ్చే కర్ణుడు దాతృత్వంతో, దైవభక్తితో ప్రసిద్ధి చెందాడు. కర్ణుడు ఈ ప్రదేశంలో చండికా దేవి కోసం కఠోర తపస్సు చేసి, ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజూ ఒక పావు వంతు బంగారాన్ని దానం చేసేవాడని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశం చారిత్రాత్మకంగా కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కర్ణుడి తపస్సుకు చండికా దేవి సంతసించి అతడిని అనుగ్రహించిందని చెబుతారు.



అమ్మవారు ఇచ్చిన వరంతో కర్ణుడు మహాభారత యుద్ధంలో అచంచలమైన బలాన్ని, ధైర్యాన్ని పొందాడు. మహాభారత పురాణం ప్రకారం కర్ణుడు తన పుట్టుక, సామాజిక స్థితి కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అతని దాతృత్వం, భక్తి అతన్ని గొప్ప యోధునిగా మార్చింది. ఈ ఆలయం కర్ణుడు జీవితాంతం అమ్మవారి పట్ల చూపిన భక్తికి ప్రతీకగా పరిగణించబడుతుంది.

Also read

Related posts

Share via