నెయ్యి కల్తీకి గత వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడమే కాకుండా.. నెయ్యిలో పందికొవ్వు కలవలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఓవైపు జంతు వ్యర్థాలు, కొన్ని రకాల నూనెలతో నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో..
తిరుమల లడ్డూ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. లడ్డూ తయారీ కోసం ఉపయోగించే నెయ్యిలో జంతు వ్యర్థాలు, కొవ్వు పదార్థాలు కలిశాయని ల్యాబ్ నివేదికలు స్పష్టం చేయడంతో ఈ అంశం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినా చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంలో నెయ్యి సరఫరా దారుడితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీటీడీ బోర్డు, మాజీ సీఎం జగన్ నిందితులేనంటూ తీవ్రంగా చర్చ జరుగుతున్న క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు కల్తీ నెయ్యి మరకలు అంటకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి నిదర్శనమే ఆయన ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు. తన న్యాయవాద బుర్రను ఉపయోగించి నెయ్యి కల్తీకి, గత వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడమే కాకుండా.. నెయ్యిలో పందికొవ్వు కలవలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఓవైపు జంతు వ్యర్థాలు, కొన్ని రకాల నూనెలతో నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో పొన్నవోలు వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన పొరపాటుకు చింతించకుండా ఈ తప్పులకు బాధ్యత వహించాల్సిన వ్యక్తులను ఆయన వెనకేసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
పందికొవ్వును పుత్తడితో పోల్చి..
తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో పందికొవ్వు కలిపారని చెప్పడం హస్యాస్పదమని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలకు సరఫరా చేసే నెయ్యి ఖరీదు కిలో రూ.320 కాగా.. అందులో రూ.1400 విలువచేసే పంది కొవ్వును ఎలా కలుపుతారని ప్రశ్నించారు. మార్కెట్‌లో పందికొవ్వు ధర రూ.400 నుంచి రూ.1400 ఉందని చెప్పారు. నెయ్యి కంటే ఖరీదైన వస్తువుతో కల్తీ ఎలా చేస్తారన్నారు. రాగితో బంగారంలో కల్తీ చేయవచ్చని, బంగారంతో రాగిని కల్తీ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇలా చెప్పడం ద్వారా పందికొవ్వును ఆయన బంగారంతో పోల్చే ప్రయత్నం చేశారు. నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని చెప్పడం అవివేకమని చెప్పుకొచ్చారు. అదే సమయంలో కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని ప్రసాదాల తయారీలో వాడలేదని పొన్నవోలు చెప్పారు. ఓవైపు కల్తీ జరగలేదంటూనే.. మరోవైపు నెయ్యి కల్తీ జరిగిందంటూ ఆయన చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కుట్ర చేశారా….?
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం ఉపయోగించే నెయ్యిలో జంతు వ్యర్థాలు, కొన్ని రకాల నూనెలు కలిపారని, పందికొవ్వు కూడా కలిసి ఉండవచ్చని ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేశాయి. మరోవైపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఖరీదైన పందికొవ్వుతో నెయ్యిని కల్తీ చేయడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్న తరుణంలో.. కావాలని ఎవరైనా కుట్రకు పాల్పడ్డారా అనే అనుమానాలు వస్తున్నాయి. తిరుమల ప్రసాదం పవిత్రతను అపవిత్రం చేసేందుకు గత ప్రభుత్వంలో ఏదైనా కుట్ర జరిగిందా అనేది విచారణలో తెలియాల్సి ఉంది.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025