SGSTV NEWS online
CrimeNational

5.6 అడుగుల అమ్మాయిలే కావాలి.. శరీరంపై మచ్చలు ఉండకూడదు!



బళ్లారి: లక్ష్మీపూజ చేస్తే లక్షలాది రూపాయలు వచ్చి పడతాయని నమ్మించారు. పూజలో పాల్గొంటే ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయని ఆశ చూపించారు. పూజల పేరుతో యువతులకు వల వేసి, చివరకు వారిని లైంగిక దోపిడీకి గురిచేస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును కర్ణాటక పోలీసులు రట్టు చేశారు. దాదాపు రెండు నెలలపాటు రహస్యంగా నిఘా పెట్టి ఈ అక్రమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేసి, నలుగురు మహిళలను రక్షించారు.


పోలీసుల విచారణ ప్రకారం.. ఈ ముఠా ప్రధానంగా పెళ్లికాని యువతులను లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలను గుర్తించి, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుంది. ఓ స్వామీజీతో ప్రత్యేక లక్ష్మీపూజ చేయిస్తామని, ఆ పూజలో పాల్గొంటే భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఆశ చూపించింది. ఈ ముఠా యువతులను ఎంపిక చేసుకునేందుకు ప్రత్యేక ప్రమాణాలు కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉండాలి, శరీరంపై ఎలాంటి మచ్చలు లేదా గాయాల గుర్తులు ఉండకూడదని నిబంధనలు పెట్టినట్లు వెల్లడించారు. యువతుల సాధారణ ఫొటోలతో పాటు కుడిచేతి, కుడికాలి ఫొటోలను కూడా సేకరించేవారని తెలిపారు.


ముగ్గురికి మూడు వాటాలు..
యువతుల ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించిన తర్వాత తమకు అనుకూలంగా ఉన్నవారిని ఎంపిక చేసుకునేవారు. లక్ష్మీపూజ ద్వారా భారీగా డబ్బు వస్తుందని, ఆ మొత్తాన్ని మూడు భాగాలుగా పంచుతామని నమ్మించేవారు. ఒక వాటా పూజలో పాల్గొన్న యువతికి, మరో వాటా పూజ నిర్వహించే స్వామీజీకి, మూడో వాటా యువతిని తీసుకొచ్చిన ఏజెంట్‌కు చెందుతుందని చెప్పేవారు. అయితే ఈ పూజలన్నీ మహిళలను వలలో వేసుకునేందుకు వేసిన ఎత్తుగడలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పూజ పేరుతో యువతులను నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీయించేవారని దర్యాప్తులో వెల్లడైంది. మత విశ్వాసాలు, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మహిళలను లైంగికంగా దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మహిళా పోలీసులే యువతులుగా మారి..
ఈ ముఠా ఆటకట్టించేందుకు బళ్లారి పోలీసులు పక్కా వ్యూహం రచించారు. అక్క ఫోర్స్‌కు చెందిన మహిళా పోలీసు సిబ్బంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులుగా నటించి ముఠాలో చేరారు. దాదాపు రెండు నెలలపాటు రహస్యంగా నిఘా పెట్టి, నిందితుల కదలికలు, వారి కార్యకలాపాలపై సమాచారం సేకరించారు. పక్కా ఆధారాలు లభించిన తర్వాత దాడులు నిర్వహించి ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు ఒక్క బళ్లారికే పరిమితం కాలేదని పోలీసులు గుర్తించారు. కర్ణాటకలోని బళ్లారి, చిక్కమగళూరు, మైసూరు ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వరకు నెట్‌వర్క్ విస్తరించినట్లు వెల్లడించారు. ముఠా సభ్యులు తమ మధ్య సమాచార మార్పిడికి కోడ్ పదాలను ఉపయోగించేవారని పోలీసులు తెలిపారు.

11 మంది అరెస్ట్..
ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేసి, నలుగురు మహిళలను పోలీసులు రక్షించారు. బళ్లారిలోని ఏపీఎంసీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ‘డీఆర్’ అనే కోడ్ పేరుతో గుర్తించిన మరో కీలక నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? యువతులను ఎలా గుర్తించేవారు? పూజల పేరుతో ఎంతకాలంగా ఈ దందా సాగిస్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Also read

Related posts