ఎంపీడీవో జవహర్ బాబుపై దాడిచేసిన సుదర్శన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనకు అర్హత లేనప్పటికీ కీలకమైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ (డీవోపీ) పదవి కట్టబెట్టారు.
జగన్ కు అత్యంత సన్నిహితుడు సుదర్శన్ రెడ్డి గత ప్రభుత్వంలో అర్హత లేకున్నా, డీవోపీ పదవి హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు
కడప: ఎంపీడీవో జవహర్ బాబుపై దాడిచేసిన సుదర్శన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనకు అర్హత లేనప్పటికీ కీలకమైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ (డీవోపీ) పదవి కట్టబెట్టారు. ఆ పోస్టులో సుదర్శన్ రెడ్డి నియామకం చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పునివ్వగా, ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమేమీ కనిపించలేదని పేర్కొంది. గాలివీడు ఎంపీపీగా ఉన్న సుదర్శన్ రెడ్డి .. ఆ పదవికి రాజీనామా చేసిన వెంటనే 2023 మే నెలలో డీవోపీగా నియమితులయ్యారు. అప్పటిదాకా ఆయన ఏ పదవిలో ఉన్నారన్నది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచిందని, ఇది ఏపీ ప్రాసిక్యూషన్ సర్వీసు నిబంధనలు, సీఆర్పీసీ, ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 78కు విరుద్ధమని పేర్కొంటూ ప్రాసిక్యూషన్స్ అదనపు డైరెక్టర్ బి. రామకోటేశ్వరరావు హైకోర్టులో అప్పట్లో వ్యాజ్యం వేశారు. దీంతో న్యాయస్థానం సుదర్శన్ రెడ్డి నియామకాన్ని రద్దు చేసింది. ప్రాసిక్యూషన్స్ నుంచి వచ్చిన వారినే డైరెక్టర్ లుగా నియమించాలని పేర్కొంది. సుదర్శన్ రెడ్డి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీపీ పదవికి రాజీనామా చేసి, ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారంటూ పిటిషనర్ చేసిన వాదనను సమర్థించింది.
అరాచక శక్తులకు కఠిన హెచ్చరిక
వైసీపీ హయాంలో దాడులు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయిన ఆ పార్టీ నాయకులు ఇంకా ఆ అరాచకాలను కొనసాగిస్తున్నారనేందుకు సుదర్శన్ రెడ్డి తీరే ఉదాహరణ. ఇన్నాళ్లూ అతని ఆగడాలకు అడ్డులేకపోగా, ఈసారి మాత్రం పోలీసులు వందల మంది చూస్తుండగా, ఎంపీపీ కార్యాలయం నుంచి బయటకు లాక్కొచ్చి అరెస్టు చేశారు. ఆ అరెస్టు చేసిన తీరు.. అరాచక శక్తులకు కఠిన హెచ్చరిక పంపించేలా ఉంది. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి తల్లి పద్మావతమ్మ గాలివీడు ఎంపీపీగా ఉన్నారు. అయినా, ఎంపీడీవో కార్యాలయంలో ఆయనే పెత్తనం చలాయిస్తున్నారు. గతేడాది చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంలోనూ సుదర్శన్ రెడ్డి అతిగా ప్రవర్తించారు.చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగి, వాయిదా పడ్డాక.. సీఐడీ ప్రత్యేక పీపీతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ స్థాయి హోదా గల అధికారి మీడియా ముందుకొచ్చి, కేసు విచారణపై మాట్లాడటం గతంలో ఎప్పుడూ లేదు.
13 మందిపై కేసులు
సుదర్శన్ రెడ్డి తో సహా ముగ్గురికి రిమాండు
రాయచోటి: ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి ఘటనలో పోలీసులు 13 మందిని నిందితులుగా గుర్తించి, వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ప్రధాన నిందితుడు సుదర్శన్ రెడ్డి పాటు భయ్యా రెడ్డి, వెంకటరెడ్డిలను శనివారం అరెస్టుచేసి, లక్కిరెడ్డిపల్లె కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండు విధించారు. నిందితులను కడప కేంద్ర కారాగారానికి తరలించామని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. నిందితుల్లో ఏ-1గా సుదర్శన్ రెడ్డి , వరుసగా గడ్డం చంద్రారెడ్డి, జల్లా ధనంజయరెడ్డి, ఎన్. రమణారెడ్డి, ఎన్. వెంకటరెడ్డి, భానుమూర్తి రెడ్డి, జి. రామాంజులరెడ్డి, ఎన్.రామాంజులరెడ్డి, యు. ధర్మారెడ్డి, రెడ్డికుమార్, ఎం.ఆంజనేయులురెడ్డి, ఎం.భయ్యారెడ్డి, పి.భయ్యారెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న పది మంది కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
Also read
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!
- Srikakulam District: ఏం మహానటివి అమ్మా… భర్తను లేపేసి భలే నాటకం
- Kolkata: ఆర్జీ కర్ ఆసుపత్రి విద్యార్ధిని ఆత్మహత్య
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..