July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

వైసీపీ, కాంగ్రెస్ లు ఒక్కటే.. ఆ పార్టీలను నమ్మొద్దు – ప్రజాగళం సభలో ప్రధాని మోడీ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని చిలకూరిపేటలో ఎన్డీఏ కూటమి ‘ప్రజాగళం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.



ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, కాంగ్రెస్ లు రెండు ఒకటే అని, ఆ పార్టీలను ప్రజలు నమొద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఆ రెండు పార్టీల్లో ఒకే కుటుంబం నుంచి వచ్చిన నాయకులు ఉన్నారని అన్నారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఆదివారం ఎన్డీఏ కూటమి నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు

మొట్టమొదటగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆంధ్రా కుటుంబ సభ్యుల నమస్కారం తెలిపారు. ‘‘నిన్ననే లోక్ సభ ఎన్నికల నగరా మోగింది. వచ్చిన వెంటనే నేను ఆంధ్రప్రదేశ్ కు వచ్చాను. కోటప్ప కొండ నుంచి మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తుందని భావిస్తున్నాను. ఈ ముగ్గురి ఆశీర్వాదాలతో ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రాబోతున్నాం. ఈ సారి ఎన్నికల్లో జూన్ 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఆ రోజు వచ్చే ఫలితాలు ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు ఇవ్వబోతోంది. అభివృద్ధి చెందిన భారత్ కావాలంటే, అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే మరో సారి 400 సీట్లు దాటాలి. ఎన్డీఏకు ఓట్లు వేయాలి.’’ అని అన్నారు.

‘ఎన్డీయే కూటమిలో వచ్చే పార్టీలతో ఎన్డీయే కూటమి బలంగా మారుతుంది. ఎన్డీయే కూటమి లక్ష్యం వికసిత భారత్. దేశంలో ఉన్న 30 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తెచ్చిన ఘనత ఎన్డీయే కే దక్కుతుంది ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆయుష్మన్ భారత్ తో అనేక మందికి వైద్యం అందించాము. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు చాలా కాలంగా ఏపీ ప్రజల కోసం కష్టపడి పని చేస్తున్నారు. వారి లక్ష్యం ఒకటే వికసిత్ భారత్ కోసం వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం. ఎన్డీఏ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ అవసరాలను నెరవేరుస్తుంది. ’’ అని అన్నారు.

వికసిత భారత్ తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యమని అన్నారు. చంద్రబాబు చేరికతో ఎన్డీఏ కూటమి మరింత బలపడిందని అన్నారు. ఎన్డీఏ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమ ప్రభుత్వ హాయంలో పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని ప్రధాని మోడీ అన్నారు. ‘‘ ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోడీ గ్యారెంటీ. ఏపీని అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి. మా హయాంలో ఏపీ ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. అనేక జాతీయ విద్యాసంస్థలను ఏపీకి తీసుకొచ్చాం. ఎన్డీఏలో అన్ని పార్టీలకు తీసుకొని ముందుకెళ్తున్నాం’’ అని అన్నారు.

అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి వల్లే ఐదేళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదని అన్నారు. ‘‘ ఏపీ ప్రజలు రెండు సంకల్పాలు తీసుకోవాలి.. ఢిల్లీలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలి. కాంగ్రెస్ అన్ని పార్టీలను వాడుకొని వదిలేస్తోంది. ఇండియా కూటమిలో ఎవరికి రావే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఆ కూటమిలో ఒకరంటే ఒకరికి పడదు. ఎన్నికలకు ముందే ఆ కూటమిలో విభేదాలు బయటపడ్డాయి.ఎన్నికల తరువాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆలోచించండి. సొంత ప్రయోజనాలు తప్ప వారికి దేశ ప్రయోజనాలు పట్టవు.’’ అని అన్నారు.

పేదలు, రైతుల కోసం ఎన్టీఆర్ పోరాడారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్డీఆర్ రాముడి పాత్రలో జీవించారని, అయోధ్యలో రామ మందరి ప్రారంభోత్సవ వేళ ఆ దృశ్యమే కనిపించిందని అన్నారు. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల వేల ఆయన స్మారక నాణెం విడుదల చేశామని అన్నారు. తెలుగు బిడ్డ పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించామని, అప్పట్లో కాంగ్రెస్ ఎన్టీఆర్ ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. అలాగే పీవీని కూడా అవమానించిందని అన్నారు.

ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు వేరని భావించవద్దని, అవి రెండూ ఒకటేనని ప్రధాని మోడీ అన్నారు. ఒకే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులే రెండు పార్టీలను నడుపుతున్నారని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఒకే తానలోని రెండు ముక్కలని అన్నారు. ఆ పార్టీలకు ఓటు వేసి తప్పు చేయవద్దని సూచించారు. కాంగ్రెస్, వైసీపీ మధ్య రహస్య స్నేహం ఉంది. వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని అన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలం అందరికీ చాలా ముఖ్యమైనదని, ప్రజలు ఎన్డీఏకు ఓటు వేస్తే అటు దేశంలో, ఇటు ఏపీలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతులకు పునాది వేస్తామని, పోర్టుల అభివృద్ది, నీలి విప్లవానికి కేంద్రం సహకరిస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

Also read

Related posts

Share via