బెంగళూరు: ఆ దంపతులు ఇద్దరూ వైద్యులు. అనారోగ్యం పాలైన భార్యకు వైద్యం చేయించడానికి బదులు ఏకంగా ఆమె ప్రాణమే తీశాడు ఆ భర్త. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హతమార్చి.. సహజ మరణంగా కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ చివరకు నిజం బయట పడింది. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, కృతికారెడ్డి గ్యాస్ట్రిక్, షుగర్ వంటి సమస్యలతో బాధ పడుతోంది. పెళ్లి సమయంలో ఈ సమస్యలు ఉన్నట్లు భార్య కుటుంబం తనకు చెప్పలేదని మహేంద్రరెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రోజూ వాంతులు, ఇతరత్రా రుగ్మతలతో ఇబ్బందులు పడే భార్యను హత్య చేసి, అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు.
ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆరోగ్యం (Health) సరిగా లేదని కృతికారెడ్డి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, మహేంద్రరెడ్డి ఆమెకు ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా రెండు రోజులు వరుసగా ఇవ్వడంతో ఆమె ఏప్రిల్ 23వ తేదీన మరణించింది. ఆపై తన భార్య అనారోగ్యంతో బాధ పడుతోందని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు.
ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు
ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో మారతహళ్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. వారి ఇంట్లో నుంచి ఇంజెక్షన్, ఐవీ సెట్ వంటి ఉప కరణాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మృతదేహం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
ఈ నెల 13వ తేదీన అందిన రిపోర్టులో కృతికారెడ్డి దేహంలో ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఆనవాళ్లు కనిపించాయని ఉంది. దీంతో అల్లుడే కూతురిని హత్య చేశాడని మృతురాలి తండ్రి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు డాక్టర్ మహేంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆమె భర్త తప్పుడు ఉద్దేశంతో కావాలనే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కు మార్సింగ్ తెలిపారు.
Also read
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
- భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి.. పార్టీ ఇచ్చాడు!
- చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య
- విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
- నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి