పాకాల, : కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు.. కన్నతండ్రే కదా అన్న నమ్మకంతో వెంటనడిచిన సొంతబిడ్డలను బావిలోకి తోసేశాడు. ఈ దారుణం తిరుపతి జిల్లా పాకాల మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు సమాచారం మేరకు.. మద్దినాయునిపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన తీపినూరు గిరికి మేనత్త కుమార్తె, పులిచెర్ల మండలం కల్లూరు సమీపంలోని తలారివారిపల్లికి చెందిన హేమంతకుమారి (35)తో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి తనుశ్రీ(11), తేజశ్రీ(7) కుమార్తెలు. కొంతకాలం క్రితం తిరుపతికి నివాసం మార్చగా అక్కడ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో స్వగ్రామం పెద్దూరుకు వచ్చారు. మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లాలని చెప్పి భార్యాపిల్లలతో ద్విచక్ర వాహనంపై బయలుదేరిన గిరి..కొమ్మిరెడ్డిగారిపల్లి మార్గంలోని కోనేబోయని ఇండ్లు గ్రామ సమీపంలో రింగురోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావివద్దకు వారిని తీసుకెళ్లాడు. గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురినీ బావిలోకి తోసేశాడు. కాసేపటికి భార్య హేమంతకుమారి, చిన్నకుమార్తె తేజశ్రీ మృతదేహాలు తేలడంతో వారిని గట్టుకు చేర్చాడు. మరో కుమార్తె కోసం వెతుకుతుండగా స్థానికులు గమనించి అక్కడికి రావడంతో గొంతు కోసుకుంటానంటూ వారిని బెదిరించాడు. ఇంతలో వారిచ్చిన సమాచారంతో పాకాల సీఐ సుదర్శనప్రసాద్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గొంతుకు కొద్దిగా గాయమైన నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. విపత్తుల నిర్వహణశాఖ సహకారంతో తనుశ్రీ మృతదేహాన్ని సైతం వెలికితీశారు.
ప్రణాళికతోనే హత్య చేశాడు
తన అల్లుడు గిరి ముందస్తు ప్రణాళికతోనే తన కుమార్తెతోపాటు మనవరాళ్లను హత్య చేశాడని మామ గంగాధరం ఆరోపించారు. అతని ఆగడాలు ఎక్కువైనట్లు తెలిసినా మంచిమాటలతోనే హెచ్చరించామని, ఇటీవల డబ్బులు కావాలంటే అప్పుచేసి రూ.25 వేలు ఇచ్చామన్నారు. పిల్లలను మంచిగా చూసుకుంటాడని భావించి అన్నీ భరించామని, చివరకు అందరినీ పొట్టనపెట్టుకున్నాడంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు విలపించడం అందరినీ కలచివేసింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025