పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో శ్రీరామనవమి వేడుకలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. పెదపేటలోని ఒక రామాలయ సందర్శన నిమిత్తం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు (RRR) పై జరిగిన దాడి యత్నం జరిగినట్లుగా తెలిసింది.
ఘటన వివరాల్లోకి వెళితే, పెదపేటలోని రామాలయంలో పూజలు నిర్వహించేందుకు రఘురామకృష్ణరాజు వెళ్లగా, స్థానికంగా ఉన్న ఒక వర్గం వారు ఆయనను తీవ్రంగా అడ్డుకున్నారు. సదరు ఆలయంలో కేవలం నందీశ్వరుడికి మాత్రమే పూజలు చేయాలని, శ్రీరాముడికి దండ వేయకూడదని వారు డిమాండ్ చేస్తూ రఘురామ కాన్వాయ్‌కు అడ్డంగా నిలబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను పక్కకు తప్పించి, డిప్యూటీ స్పీకర్‌ను ఆలయంలోకి తీసుకెళ్లారు. లోపల ఉద్రిక్తతల మధ్యే రఘురామ శ్రీరాముడికి దండ వేసి, తన పూజా కార్యక్రమాలను ముగించుకున్నారు.
అయితే అసలు హింస రఘురామకృష్ణరాజు ఆలయం నుండి బయటకు వచ్చి, మరొక ఆలయానికి వెళ్తున్న సమయంలో చోటుచేసుకుంది. ఆయనను అనుసరిస్తున్న జనసేన కార్యకర్తలపై ఆందోళనకారులు ఒక్కసారిగా మేకులు ఉన్న కర్రలు, చాకులతో విరుచుకుపడ్డారు. జనసేన నేత అనిల్ తలలోకి మేకులు దిగబడటంతో ఆయన రక్తసిక్తమయ్యారు. ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించిన మరో జనసైనికుడి వీపుపై దుండగులు చాకుతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, శాంతియుతంగా వేడుకలు జరుపుకుంటున్న వారిపై ఆయుధాలతో దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, దళితుల పేరుతో కొందరు అరాచక శక్తులు ఈ దాడులకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఆకివీడులో హైటెన్షన్ నెలకొంది. దాడిని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కూటమి నాయకులపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. పురాతన రామాలయ పునరుద్ధరణకు పూనుకున్న తరుణంలో, భక్తితో పూజలకు వెళ్లిన వారిపై ఆయుధాలతో దాడి చేయడం గర్హనీయమని ఆయన పేర్కొన్నారు. పవిత్రమైన పండుగ సమయంలో సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదని, ఈ ఘటనలో పలువురు గాయపడి ఆసుపత్రి పాలవ్వడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Also read
- Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!
- మాదాపూర్‌లో విషాదం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగింది?
- Hyderabad: మరోసారి నేపాలి గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్ తో దోపిడీ!
- Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!
- ద్రౌపది పాండవులను వివాహం చేసుకోవడం వెనుక ఉన్న రహస్యం ద్విజన్మ రహస్యం!





