వారాంతపు సెలవుల్లో తల్లిదండ్రులతో గడిపేందుకు భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి కారులో సొంతూరికి బయల్దేరిన ఉద్యోగికి మార్గంమధ్యలో ఛాతీ నొప్పి వచ్చింది. ఆసుపత్రికి వెళ్లేందుకు కారు వెనక్కు తిప్పుతుండగా ప్రమాదవశాత్తూ ఎస్సారెస్పీ కాలువలోకి నడిపేశారు.

వరంగల్, పర్వతగిరి, నెల్లికుదురు: వారాంతపు సెలవుల్లో తల్లిదండ్రులతో గడిపేందుకు భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి కారులో సొంతూరికి బయల్దేరిన ఉద్యోగికి మార్గంమధ్యలో ఛాతీ నొప్పి వచ్చింది. ఆసుపత్రికి వెళ్లేందుకు కారు వెనక్కు తిప్పుతుండగా ప్రమాదవశాత్తూ ఎస్సారెస్పీ కాలువలోకి నడిపేశారు. ఈ ఘటనలో అతనితోపాటు కుమార్తె, కుమారుడు సైతం మృతిచెందారు. ప్రమాదాన్ని పసిగట్టిన భార్య కుమారుడిని బయటకు విసిరేసి తానూ నీటిలోకి దూకారు. కానీ ఆమె ప్రాణాలతో బయటపడగా.. కుమారుడు మాత్రం నీట మునిగిపోయాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్కుమార్(40), కృష్ణవేణి దంపతులకు కుమార్తె సాయిచైత్ర(5), కుమారుడు సాయివర్ధన్(3) ఉన్నారు. ప్రవీణ్ హనుమకొండలో ఎస్ఐసీ గృహరుణాల విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు
శనివారం కుటుంబంతో కలిసి స్వగ్రామానికి బయల్దేరగా.. కొంకపాకకు శివారులోకి రాగానే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. తిరిగి వరంగల్ లోని ఆసుపత్రికి వెళ్లామని భార్య చెప్పడంతో కారును వెనక్కి తిప్పారు. ఈ క్రమంలో నొప్పి తీవ్రమవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎస్సీరెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. అంతకుముందు కృష్ణవేణి తన ఒడిలో ఉన్న బాబును ముందు డోర్ నుంచి రహదారిపైకి విసిరే ప్రయత్నం చేయగా అతను నీటిలోనే పడిపోయాడు. అనంతరం ఆమె కాలువలోకి దూకారు. పక్కనే ఉన్న స్థానికులు తాళ్ల సహాయంతో ఆమెను కాపాడారు. కారుపడిన ప్రదేశానికి సమీపంలోనే సాయివర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కారు వంద మీటర్ల వరకు కొట్టుకుపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. కారులోనే తండ్రీకుమార్తెలు విగతజీవులుగా కనిపించారు. ప్రవీణ్ సోదరుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాజగోపాల్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఈ తరహా ప్రమాదం జరగడం రెండోసారి. 2021 ఫిబ్రవరి 10న ఓ వాహనం కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలోనూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కొడుకును కాపాడుకున్నాననుకున్నా..
కారు అద్దం కిందికి ఉండటంతో వెంటనే బాబును బయటకు విసిరేసి నేనూ దూకాను. కొడుకునైనా కాపాడుకున్నానని భావించాను. తీరా బయటకు వచ్చి చూస్తే అతనూ నాకు దక్కకుండా పోయాడు’ అంటూ కృష్ణవేణి సాయివర్ధన్ మృతదేహాన్ని హత్తుకొని బోరున విలపిస్తుండటం చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబం మొత్తాన్నీ కోల్పోయాక ఇక తాను ఎవరి కోసం బతకాలని గుండెలవిసేలా రోదించారు. ‘ఊరికి రాకుం మీ ప్రాణాలు పోకుండే బిడ్డా’ అని ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు పద్మ, సారంగపాణిలు విలపించారు.
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి