November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

తిరుమలలో బాలుడి కిడ్నాప్‌కు షాకింగ్ కారణం.! కిడ్నాపర్ దేవి అరెస్ట్.

తిరుమలలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కథకు పోలీసులు శుభం కార్డు వేశారు. కిడ్నాప్ జరిగిన 24 గంటల్లోనే మహిళను అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక కిడ్నాప్ చేసిన మహిళ బాలుడి కిడ్నాప్ గురించి చెప్పిన విషయాలు విన్న పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలంగాణ గద్వాల జిల్లా ఐజకు చెందిన నగేష్, పరిమళ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆరేళ్ల అక్షయ్ కాగా, చిన్న కుమారుడు మూడేళ్ల అభినయ్. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి తిరుమలకు రాగా, వసతి గది దొరక్కపోవడంతో పిఏసీ 2లో వారు సేద తీరారు. అయితే కిడ్నాపర్‌ ఇజ్జాడ దేవి మొబైల్ ఫోన్‌తో అభినయ్ ను ఆడిస్తూ, తల్లిదండ్రుల కళ్ళుగప్పి అక్కడ నుంచి బాలుడిని కిడ్నాప్ చేసింది. బిడ్డ కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కిడ్నాప్ చేసిన బాలుడిని ఒక జీపులో తిరుపతికి తీసుకువచ్చిన దేవి అక్కడినుంచి సంధ్య థియేటర్ రోడ్ లోకి వెళ్లి అక్కడున్న ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఆవుల ప్రభాకర్ యాదవ్ ను అద్దె గది కావాలని అడిగింది. ప్రభాకర్ యాదవ్ అద్దె గదులు పెద్దకాపు లే అవుట్ లో ఉంటాయనిఆ మహిళకు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.



మహిళ వెళ్లిన కొద్దిసేపటికే ఆర్టీసీ డిపో మేనేజర్ ద్వారా వాట్సాప్ లో కిడ్నాప్ వివరాలు చూసిన ప్రభాకర్ బాలుడికి గుర్తుపట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెద్దకాపు లేఔట్ లోని లాడ్జిలో ఉన్నట్టు అనుమానించిన పోలీసులు, అక్కడ గాలింపు చర్యలు చేపట్టి నిందితురాలిని, బాలుడిని పట్టుకున్నారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే బాలుడు కిడ్నాప్ గురించి మహిళ తనకు ఆడబిడ్డ ఉందని, మగపిల్లాడు లేక పెంచుకోవాలన్న ఉద్దేశంతో తిరుమల నుంచి బాలుడిని ఎత్తుకొచ్చినట్లు చెప్పింది. అయితే ఆ మహిళ వేరే వ్యక్తికి బాలుడిని ఇవ్వడానికి ప్రయత్నించిందని, అతను రావటం ఆలస్యం కావడంతోనే పోలీసులకు చిక్కిందని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via