SGSTV NEWS online
Andhra PradeshViral

Viral Video: గజరాజు ఆక్రోషం.. ఒక్కసారిగా మావటిపైకి తిరగబడిన ఏనుగు.. ఇదిగో వీడియో!



తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆలయ సేవల్లో పాల్గొనే ఓ ఏనుగు ఒక్కసారిగా బెదిరిపోయి మావటిపై దాడికి పాల్పడింది. అది చూసిన భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇక ఏనుగు దాడితో తీవ్రంగా గాయపడిన మావటి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దాదాపు 14 ఏళ్లుగా తిరుచానూరులోని గజశాలలో ఉంటూ అమ్మవారి సేవలో తరిస్తున్న 17 ఏళ్ల వయసు కలిగిన శ్రీనిధి అనే ఏనుగు వాహన మండపం వద్ద హల్‌చల్ చేసింది. రోజూ మాదిరిగానే సాయంత్రం 6 గంటల సమయంలో ఇద్దరు మావటీలు శ్రీనిధిని గజశాల నుంచి ఆలయానికి తీసుకొస్తుండగా.. ఆ ఏనుగు ఒక్కసారిగా వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ముందుగా ఒక మావటిపై దాడి చేసేందుకు ఏనుగు ప్రయత్నించగా, దాన్ని అదుపు చేసేందుకు మరో మావటి చంద్రయ్య ముందుకు వచ్చాడు.


ఆ సమయంలో ఏనుగు చంద్రయ్యను తొండంతో చుట్టి బలంగా విసిరికొట్టింది. అంతటితో ఆగకుండా కిందపడిన చంద్రయ్యను కాళ్ల కింద వేసి తొక్కింది. దీంతో తీవ్రంగా గాయపడిన చంద్రయ్యను వెంటనే చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు.



రోప్‌తో భద్రత కల్పించాలని విజిలెన్స్‌కు లేఖ


మరోవైపు, గత 14 ఏళ్లుగా ఒంటరిగా ఉన్న శ్రీనిధి అనే ఆడ ఏనుగుకు తోడుగా ఈ ఏడాది మే 25న అవనిజ అనే మరో ఏనుగును టీటీడీ తిరుచానూరుకు తీసుకొచ్చింది. గత 3 నెలలకు పైగా ఎస్వీ జూ పార్క్ మావటీల ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న అవనిజ.. ఆలయ పవిత్ర ఊరేగింపులు, ఆచార సేవలకు సంబంధించిన అంశాలపై అవగాహన పొందింది.

ఈ నేపథ్యంలో అవనిజను ఊరేగింపుల్లో వినియోగించే సమయంలో ఏనుగుకు దగ్గరగా ఎవరూ రాకుండా, భక్తులు నేరుగా ఆహారం తినిపించకుండా ఉండేందుకు శాశ్వత ప్రాతిపదికన రోప్ పార్టీని ఏర్పాటు చేయాలని టీటీడీ గోశాల డైరెక్టర్ నిర్ణయించారు. దీనివల్ల ఏనుగు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండటంతో పాటు భక్తుల భద్రతను కాపాడవచ్చని పేర్కొంటూ గత నెల 29న టీటీడీ విజిలెన్స్ విభాగానికి గోశాల అధికారులు లేఖ రాశారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీనిధి అనే ఏనుగు దాడికి పాల్పడటం ఆలయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also read

Related posts