Vangalapudi Anitha: అనకాపల్లి జిల్లా వేదికగా
హోం మంత్రి వంగలపూడి అనిత వైసిపి నాయకుడు అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని.. ఆయన ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆమె మండిపడ్డారు. గతంలో తాను గౌరవార్థం ‘గారు’ అని సంబోధించేదాన్నని.. కానీ అంబటి రాంబాబు ప్రవర్తన చూస్తుంటే ఆయన ఆ గౌరవానికి ఏమాత్రం అర్హుడు కాదని అనిత స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలను హోం మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చంద్రబాబు గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడే ముందు నీ ఇంటికి వెళ్లి నీ భార్యను, కూతురిని అడుగు, వారు చెబుతారు ఆయన విలువ ఏమిటో’ అంటూ ఘాటుగా స్పందించారు. అంబటి రాంబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసం అత్యంత నీచమైన భాషను వాడుతున్నారని.. ఇది ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసిపి నేతలు కుట్రలు చేస్తున్నారని అనిత ఆరోపించారు. విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పట్టాభి ఒక పదం వాడారనే నెపంతో పార్టీ కార్యాలయంపై దాడులు చేశారని, ఇప్పుడు అంబటి అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నారని గుర్తుచేశారు.
చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైలుకు పంపినందుకే ప్రజలు వైసిపిని 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారని ఆమె విమర్శించారు. పోలీసులపై కూడా అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని, విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించే పన్నాగం సాగనివ్వమని అనిత స్పష్టం చేశారు. అంబటి మాట్లాడే భాషను ఆయన కుటుంబ సభ్యులు కూడా సమర్థించరని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హితవు పలికారు.
Also read
- పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాడి
- కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి!
- కేపీహెచ్బీలో దారుణం.. మూడంతస్తుల భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
- లడ్డులో కల్తీ లేదని ఎక్కడుంది?
- మొగుడొద్దు.. ప్రియుడే ముద్దు..! హనీమూన్ మర్డర్ను మించి.. భర్తను ఎలా లేపేసిందో తెలిస్తే..





