December 4, 2024
SGSTV NEWS
National

Patanjali: పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్

14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ క్యాన్సిల్


తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనల వ్యవహారంలో చర్యలు తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం

సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ధామి సర్కారు వెల్లడి

పతంజలి అడ్వర్టైజ్ మెంట్ల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, పతంజలి సంస్థకు చెందిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ను రద్దు చేశామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈమేరకు దేశ అత్యున్నత కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో వివరాలు వెల్లడించింది. సదరు ఉత్పత్తుల తయారీపై బ్యాన్ విధిస్తూ దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కు ఈ నెల 15న ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ లైసెన్సింగ్ అథారిటీ కోర్టుకు తెలిపింది. దీంతోపాటు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ లపై హరిద్వార్ చీఫ్ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్ కు క్రిమినల్ కంప్లైంట్ చేసినట్లు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.

తయారీ బ్యాన్ విధించిన ఉత్పత్తులు ఇవే..
దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రొన్‌కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్.

పతంజలిపై ఇదీ కేసు..
ఆధునిక వైద్యాన్ని కించపరిచేలా యాడ్స్ ప్రచురిస్తున్నారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అల్లోపతి మందులతో ఉపయోగం ఉండదని, పతంజలి ఉత్పత్తులనే వాడాలని ప్రకటనలు విడుదల చేయడంపై మండిపడింది. పతంజలి యాజమాన్యం, బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి ఆయుర్వేద, యునానీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రచారం చేయడంపై ఐఎంఏ అభ్యంతరం తెలిపింది. ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతం విచారణ జరుపుతోంది. కోర్టుకు హాజరైన బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణలు ఈ కేసులో కోర్టును క్షమాపణలు కోరారు. బహిరంగ క్షమాపణ కోరుతూ వార్తాపత్రికలలో యాడ్స్ కూడా ప్రచురించారు

Also read

Related posts

Share via