Tragedy : పెళ్లి ఇంట్లో డప్పులు, మేళతాళాలు, బంధుమిత్రుల సందడితో కళకళలాడాల్సిన వేడుక ఒక్కసారిగా ఘోర విషాదంగా మారింది. పెళ్లి తంతు జరుగుతుండగానే
Tragedy : పెళ్లి ఇంట్లో డప్పులు, మేళతాళాలు, బంధుమిత్రుల సందడితో కళకళలాడాల్సిన వేడుక ఒక్కసారిగా ఘోర విషాదంగా మారింది. పెళ్లి తంతు జరుగుతుండగానే వరుడు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పెళ్లి మండపం ఆనందానికి బదులుగా శోకసంద్రంగా మారిపోయింది. ఈ హృదయ విదారక ఘటన బీహార్ రాష్ట్రంలోని మోతిహారి జిల్లా రామ్గఢ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిక్నీ గ్రామంలో చోటుచేసుకుంది.
మండపంలో కూర్చుండగానే కడుపునొప్పి మఝౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వాలియా గ్రామానికి చెందిన 25 ఏళ్ల శక్తినాథ్ శర్మ వివాహ ఊరేగింపు ఘనంగా చిక్నీ గ్రామానికి చేరుకుంది. వధువు కుటుంబ సభ్యులు పెళ్లి బృందానికి ఘన స్వాగతం పలికి అతిథులకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం వేదమంత్రాల మధ్య వివాహ తంతు ప్రారంభమైంది. వధూవరులు ఇద్దరూ కల్యాణ మండపంలో కూర్చున్న సమయంలో వరుడికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం రక్సౌల్లోని ఎస్ఆర్పీఎస్ ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ అక్కడికి చేరుకునే సరికే వరుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
కన్నీరుమున్నీరవుతున్న వధువు.. గ్రామంలో విషాద ఛాయలు కొత్త జీవితం గురించి ఎన్నో ఆశలతో వివాహ వేదికపై కూర్చున్న వధువు రఘుని కుమారి, కళ్లముందే కాబోయే భర్త అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కాళ్ల పారాణి ఆరకముందే ఈ ఘోర విషాదం చోటుచేసుకోవడంతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతుడు శక్తినాథ్ శర్మ తన ముగ్గురు సోదరుల్లో అందరికంటే చిన్నవాడు. అతని తల్లిదండ్రులు ఇప్పటికే మరణించగా, అన్నయ్యే పెద్ద దిక్కై సంరక్షకుడిగా వ్యవహరిస్తూ ఎంతో ఆశతో ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన వేళ వరుడు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో భర్వాలియా గ్రామం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
