SGSTV NEWS online
CrimeTelangana

వరంగల్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలి మృతి..


మట్టెవాడ: వరంగల్లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు మృతిచెందారు. మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన ఎస్. మమతారాణి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. నగరంలోని హంటర్రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రతో ఆమెకు వివాహం జరిగింది.

సోమవారం రాత్రి విధులు ముగించుకొని భర్తతో కలిసి హంటర్ రోడ్డు మీదుగా బైక్పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఏడు మోరీల కూడలి వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన టిప్పర్ వారి బైక్ను ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు కింద పడిపోయారు. 9 నెలల గర్భిణిగా ఉన్న మమతా రాణి తీవ్రంగా గాయపడటంతో స్థానికుల సహాయంతో భర్త నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. టిప్పర్ డ్రైవర్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఝార్ఖండ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts