November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ముగ్గురు మహిళలు అనుమానాస్పద మృతి
లభ్యం కాని మృతుల వివరాలు



కర్నూలు : కర్నూలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారిలో ఇద్దరి మృతదేహాలు చెరువులో ఉన్నాయి. మరో మహిళ మృతదేహం చెరువు గట్టుపై ఉంది. ప్రమాదవశాత్తు వీరు మృతి చెందారా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతి చెందిన మహిళల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం… కర్నూలు మండలం గార్గేయపురం సమీపంలోని నగరవనం వద్ద చెరువులో ఇద్దరి మహిళల మృతదేహాలు నీటిపై తేలియాడుతూ ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అదే చెరువు గట్టుపై గాయాలతో మరొక మహిళ మృతదేహం కనిపించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీములను రప్పించి ఆనవాళ్లను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా సర్వజన వైద్యశాలకు తరలించారు. చుట్టుపక్కల వారిని విచారించినా ఆ మహిళలు ఎవరన్నదీ తెలియరాలేదు. ఈ ఘటన ప్రమాదవశాస్తు జరిగిందా? లేక ఎక్కడో హత్య చేసి మృతదేహాలను ఇక్కడ ఇలా పడేశారా? లేదా? ఇక్కడే హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇతర జిల్లాలకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ మధ్య ఎక్కడైనా మహిళల మిస్సింగు కేసులు ఉన్నాయా? అనే వివరాలు సేకరిస్తున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన కర్నూలు రేంజ్‌ డిఐజి, ఎస్‌పి
ఘటనా స్థలాన్ని కర్నూలు రేంజ్‌ డిఐజి సిహెచ్‌.విజయరావు, జిల్లా ఎస్‌పి జి.కృష్ణకాంత్‌ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముగ్గురు మహిళల మృతదేహాలు ఒకేసారి బయటపడడంతో లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలకు జిల్లా అడిషనల్‌ ఎస్‌పి, డిఎస్‌పి ర్యాంకు అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తామని, ఈ నివేదిక, సాంకేతిక అంశాల ఆధారంగా ఈ కేసు నిగ్గు తెలుస్తామని చెప్పారు. వారి వెంట అడిషనల్‌ ఎస్‌పి నాగరాజు, డిఎస్‌పి విజరు శేఖర్‌, తాలూకా సిఐ శ్రీధర్‌, నాలుగో పట్టణ సిఐ శంకరయ్య ఉన్నారు.

భయాందోళనలో స్థానికులు
ఒకేసారి మూడు మృతదేహాలు బయటపడడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి పక్కన ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read

Related posts

Share via