November 21, 2024
SGSTV NEWS
CrimeNational

ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు

తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్ గఢ్ మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్ కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.

జోగన్న, వినయ్, సుష్మితగా గుర్తింపు వీరిపై వరుసగా రూ.25 లక్షలు, రూ.8 లక్షలు, రూ.2 లక్షల రివార్డు

హైదరాబాద్: తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్ కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటివరకూ ఎనిమిది మందిని గుర్తించగా.. అందులో ముగ్గురు తెలంగాణ వాసులు ఉన్నారు. వారిని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జియ్యారం గ్రామానికి చెందిన జోగన్న అలియాస్ ఝిస్సు అలియాస్ చీమల నర్సయ్య (66), మంచిర్యాల జిల్లాకు చెందిన వినయ్ అలియాస్ కేశబోయిన అలియాస్ రవి (55), వరంగల్కు చెందిన సుష్మిత అలియాస్ చైతె (26)గా గుర్తించారు. వీరు చాలాకాలంగా ఛత్తీస్ గఢ్ లో పనిచేస్తున్నారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్న జోగన్నపై 196 కేసులు ఉండగా ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడైన రవిపై రూ.8 లక్షలు, మావోయిస్టు పార్టీ సభ్యురాలైన తిక్క సుష్మితపై రూ.2 లక్షల రివార్డు ఉంది. గత నెల 16న ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లా అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించగా వారిలో భూపాలపల్లి జిల్లాకు చెందిన శంకర్రావు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆయన భార్య దాసర్వర్  సుమన అలియాస్ రజిత ఉన్నారు. 15 రోజుల వ్యవధిలో జరిగిన మరో ఎన్కౌంటర్లో తాజాగా ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మరణించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యమం బలహీనపడగా, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారు వరుసగా ఐదుగురు మరణించడంపై మావోయిస్టు పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.

జోగన్న భార్య సైతం మృతి!

గోదావరిఖని, భీమదేవరపల్లి, హసన్పర్తి, న్యూస్టుడే: పెద్దపల్లి జిల్లా జయ్యారం గ్రామానికి చెందిన చీమల నర్సయ్య అలియాస్ జోగన్న.. చిన్నతనంలో గ్రామంలో పాలేరుగా పనిచేసే వారని గ్రామస్థులు తెలిపారు. తల్లిదండ్రులు లింగయ్య, బీమరాజమ్మ కాలంచేశారని, ఆయన సోదరి అంతర్గాం మండలం ఆకెనపల్లిలో ఉంటున్నారని వెల్లడించారు. నర్సయ్య గోండియా ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో దళంలోని సభ్యురాలిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ మృతుల్లో నర్సయ్య భార్య సైతం ఉన్నట్లు చెబుతున్నాయి

ఎన్ కౌంటర్ లో వినయ్ అలియాస్ రవి మృతిపై హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని ఆయన సోదరుడు వెంకటికి పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఆయన ఛత్తీస్గఢ్ బయలుదేరారు. తమ తండ్రి కాశవేని రాజయ్యకు సింగరేణిలో ఉద్యోగం రీత్యా మంచిర్యాల జిల్లా బెలంపల్లిలోనే రవి పెరిగారని వెంకటి తెలిపారు.

ఇంటర్ చదువుతూనే దళంలోకి సుష్మిత

తిక్క సుష్మిత (26) స్వస్థలం హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సుబ్బయ్యపల్లి. 2016లో ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఆమె మావోయిస్టు దళంలో చేరింది. సుధాకర్, ఆయన సోదరులు రవి, దేవేందర్ లు సైతం దళంలో పనిచేసి బయటకు వచ్చారు. రెండు రోజుల క్రితమే సెల్ఫోన్లో మాట్లాడిన సుష్మిత కనిపించక సుమారు నాలుగేళ్లు గడిచిపోయిందని తండ్రి సుధాకర్ కన్నీరు పెట్టుకున్నారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ ఎన్ కౌంటర్ చేశారని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకం మల్లేశం తెలిపారు.

Also read

Related posts

Share via