July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

విషాదం నింపిన కోడిగుడ్డు వివాదం

జగిత్యాలరూరల్‌: కోడిగుట్టు వివాదం విషాదం నింపింది. ఈ గొడవలో కొడవలి వేటుకు గురైన మహిళ తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన మేడిపల్లి సురేశ్‌–రమ(40)దంపతులకు కొడుకు రిషివర్దన్‌, కుమార్తె వాణి ఉన్నారు. సురేశ్‌ ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. వీరి కుమార్తె వాణిని ఇదే గ్రామానికి చెందిన బోగ ప్రకాశ్‌ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సురేశ్‌, రమ దంపతులు నిరాకరించారు.

కక్ష పెంచుకున్న ప్రకాశ్‌ సోమవారం జరిగిన హోలీ వేడుకల్లో రమ ఇంట్లోకి కోడిగుడ్డు విసిరాడు. దీంతో రిషివర్దన్‌ తమ ఇంట్లోకి కోడిగుడ్డు ఎందుకు విసిరావని ప్రకాశ్‌ను నిలదీయగా రిషివర్దన్‌పై దాడిచేశాడు. స్థానికంగా ఉన్న వారు రిషివర్దన్‌ తల్లి రమకు సమాచారం అందించడంతో అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రకాశ్‌ కొడవలితో రమ మెడపై దాడిచేశాడు. గొంతుకు తీవ్రగాయాలు కావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి కొడుకు రిషివర్దన్‌ ఫిర్యాదు మేరకు ప్రకాశ్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు రూరల్‌ సీఐఆరీఫ్‌ అలీఖాన్‌, రూరల్‌ ఎస్సై సదాకర్‌ తెలిపారు.

గ్రామంలో విషాదం
తిప్పన్నపేట గ్రామంలో మేడిశెట్టి రమ హోలీ సంబరాల్లో కోడిగుడ్డు వివాదంలో హత్యకు గురికాగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అందరు మహిళలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న రమ హత్యకు గురికావడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. దుబాయ్‌లో ఉన్న ఆమెభర్త సురేశ్‌ మంగళవారం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు

Also read

Related posts

Share via