SGSTV NEWS online
CrimeTelangana

అర్ధరాత్రి నగ్నంగా వీధుల్లో పరుగెత్తి.. ఆపై చెరువులో దూకి…సీసీటీవీ వీడియో



మేడిపల్లి ఠాణా పరిధిలో కలకలం రేపిన యువతి ఆత్మహత్య

హైదరాబాద్: చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం.. రూ. లక్షల్లో జీతం.. ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. విధుల్లో ఒత్తిడి భరించలేక ఇంటికే పరిమితమైంది. అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ వీధుల్లో నగ్నంగా పరుగెత్తుకుంటూ వెళ్లింది. మధ్యలో ఆలయంలో మొక్కింది. తిరిగి పరుగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లోని మేడిపల్లి పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన వక్కులగడ్డి ఈశ్వర్రావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని(25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేసేది. విధుల్లో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి విశాఖపట్నం వెళ్లిపోయింది. రెండు నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్కు వచ్చి పీర్జాదిగూడలోని శంకర్నగర్కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. తండ్రి విశాఖపట్నంలోనే ఉంటున్నారు. మరోచోట గదిని అద్దెకు తీసుకోవడానికి అరుణ, తేజస్విని కలిసి శుక్రవారం సాయంత్రం వరకు మియాపూర్లో గాలించారు. రాత్రి తిరిగి పీర్జాదిగూడకు వచ్చి పడుకున్నారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో నిద్రలేచిన తేజస్విని.. తల్లి ఉండే గదికి బయట నుంచి తాళం వేసింది. అనంతరం చేతిలో చీర పట్టుకుని నగ్నంగా వీధిలోకి వెళ్లి పరుగెత్తింది.

మార్గంమధ్యలో స్థానిక బీరప్పగుడి వద్ద ఆగి మొక్కింది. మళ్లీ పరుగెడుతూ పీర్జాదిగూడలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యాలు స్థానికంగా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం నిద్రలేచిన తల్లి తలుపులకు తాళం వేసినట్లు గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తెరిచారు. కుమార్తె కోసం గాలించగా.. చెరువులో చనిపోయి కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె తరచూ పీడకలలు వస్తున్నాయని చెప్పేదని, మానసిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి మేడిపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మృతురాలు ఫియర్ ఫోబియాతో బాధపడేదని పోలీసుల విచారణలో తేలింది.

Also read

Related posts