July 3, 2024
SGSTV NEWS
CrimeLatest News

తమ్ముడిని నాటు తుపాకీతో కాల్చిన అన్న

వారిద్దరూ అన్నదమ్ములు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి పంపకంలో పంతాలకు పోయారు. పేగు బంధాన్ని కాదని ఘర్షణకు దిగారు. పెద్ద మనసు చేసుకోవాల్సిన అన్న బాధ్యత మరచి తమ్ముడిపై దాడికి దిగాడు. కోపంలో నాటు తుపాకీ చేతబట్టి సోదరుడిపై కాల్పులకు తెగబడ్డాడు. తీవ్రగాయాలతో తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

గుర్రంకొండ : ఆస్తి వివాదం పెద్దది కావడంతో తమ్ముడిని అన్న నాటు తుపాకీతో కాల్చిన సంఘటన మండలంలోని టి.పసలవాండ్లపల్లె పంచాయతీ చాగలపల్లె దళితవాడలో జరిగింది. గ్రామానికి చెందిన బాలపోగు జయప్ప, బాలపోగు విశ్వనాథ్‌లు అన్నదమ్ములు. వీరికి గ్రామానికి సమీపంలోనే తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పొలం ఉంది. గత కొంత కాలంగా ఆస్తి పంపకాలు, ఇతరత్రా విషయాలపై తరచూ అన్నదమ్ములు గొడవపడేవారు. ఇటీవల విశ్వనాథ్‌ ఇంటి ముందు ఉన్న టెంకాయ చెట్టును జయప్ప నరికి వేశాడు. ఈవిషయమై మంగళవారం రాత్రి విశ్వనాథ్‌ అన్న జయప్పను ప్రశ్నించాడు.

తన ఇంటి ముందున్న చెట్టును ఎందుకు నరికి వేశావంటూ నిలదీయంతో వివాదం రాజుకొంది. పాత కక్షలు మనసులో పెట్టుకొని జయప్ప తమ్ముడు విశ్వనాథ్‌తో ఘర్షణకు దిగాడు. వివాదం పెద్దది కావడంతో అడవి జంతువులను వేటాడడం కోసం తన వద్ద దాచి ఉంచిన నాటు తుపాకీని తీసుకొచ్చి జయప్ప తన తమ్ముడు విశ్వనాథ్‌పై కాల్పులు జరిపాడు. ఈకాల్పుల్లో విశ్వనాథ్‌కు ఛాతీ, తొడలపై రక్తగాయాలు అయ్యాయి. గాయపడిన విశ్వనాథ్‌ను కుటుంబసభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగార్జున రెడ్డి తెలిపారు.

Also read

Related posts

Share via