October 16, 2024
SGSTV NEWS
Crime

Crime news: ఖాకీల కర్కశత్వం.. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో పోలీసులు ఎస్సీ మహిళను దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్సీ మహిళను దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష చర్య సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. లాకప్ హింస ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. గత నెల 24న షాద్నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులు దొంగతనం చేశారని నాగేందర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడిని స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం భర్తను వదిలేసిన డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి, అతని సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని సీఐ తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత ఇంటికి పంపించారని బాధితురాలు వాపోయింది. 24 తులాల బంగారం, రూ.2 లక్షల నగదుకు గానూ కేవలం ఒక తులం బంగారం, రూ. 4వేల నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా రిమాండ్ చెయ్యకుండా ఇంటికి పంపించడం వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా  తెలుస్తోంది. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు.

Also read :

Related posts

Share via