June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ప్రాణాలు తీసిన విద్యుదాఘాతం ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల దుర్మరణం



  • ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. చదువుకుంటూనే తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ కుమారులను చూసి ఈర్ష్య పెంచుకుంది.

గిద్దలూరు పట్టణం, : ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. చదువుకుంటూనే తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ కుమారులను చూసి ఈర్ష్య పెంచుకుంది. కలివిడిగా ఉంటూ కుటుంబ పోషణకు తమవంతు సహకారం అందిస్తున్న అన్నదమ్ముల పైకి విద్యుత్తు తీగ రూపంలో యమపాశాన్ని విసిరింది. ఇద్దరి ప్రాణాలను ఒకేసారి అనంతవాయువుల్లో కలిపేసింది. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. ఇంటి వెలుగులను ఒకేసారి ఆర్పేసి చీకట్లు మిగిల్చింది. కన్నవారికి గర్భశోకాన్ని, తీరని ఆవేదనను మిగిల్చింది. ఈ విషాద ఘటన గిద్దలూరు నగర పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది.

టెంట్ సామగ్రి తెచ్చేందుకు వెళ్లి…: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన శీలం గోపీకృష్ణ సప్లయర్స్ దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. ఈయనకు భార్య మల్లేశ్వరి, కుమారులు లోహిత్ కృష్ణ(18), దేశాయి కృష్ణ(16), కుమార్తె ఉన్నారు. లోహిత్ కృష్ణ ఇంటర్మీడియట్ పూర్తిచేసి ప్రస్తుతం ఐటీఐ చదువుతున్నాడు. దేశాయికృష్ణ ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 530 మార్కులు సాధించాడు. మార్కాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేరి ఇంటర్మీయట్ చదివేందుకు సిద్ధమవుతున్నాడు. గిద్దలూరు నగర పంచాయతీ ఒంగోలు రహదారిలోని ఓ గృహ ప్రవేశానికి సంబంధించి టెంట్లు, సామగ్రిని గోపీకృష్ణ సమకూర్చారు. వేడుక ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకొచ్చేందుకు లోహిత్ కృష్ణ, దేశాయి కృష్ణ సోమవారం ఉదయం ఆ గృహం వద్దకు ఆటో తీసుకుని వెళ్లారు. టెంట్లు, సామగ్రితో దుకాణానికి తిరిగి వస్తుండగా సామగ్రి తగిలి ఓ సర్వీస్ తీగ తెగి ఆటోపై పడింది. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై  సోదరులిద్దరూ కింద పడిపోయారు. వారి వెంట వచ్చిన మరో యువకుడు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. సమీప టీ దుకాణం వద్ద ఉన్న వారు గుర్తించి లోహిత్ కృష్ణ, దేశాయి కృష్ణను చికిత్స నిమిత్తం గిద్దలూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఇద్దరూ మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ముండ్లపాడు వాసులు పెద్ద సంఖ్యలో గిద్దలూరు ప్రభుత్వ వైద్యాశాల వద్దకు తరలి వచ్చి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

Also read

Related posts

Share via