July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

Pawan Kalyan: ముఖ్యమంత్రి కాదతను… ఓ సారా వ్యాపారి: పవన్ కల్యాణ్

అనకాపల్లిలో వారాహి విజయభేరి సభ
హాజరైన పవన్ కల్యాణ్
అనకాపలి అంటే ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకువస్తోందని వ్యంగ్యం
రాష్ట్రం కోసం జనసేన పార్టీ త్యాగం చేసిందని వెల్లడి
ఒక్క తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో మూడు పార్టీలు కలిశాయని స్పష్టీకరణ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ అనకాపల్లిలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన ప్రసంగిస్తూ, అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకువచ్చేదని, కానీ ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకువస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవాళ జనసేన పార్టీ నిజంగా త్యాగం చేసిందని, ప్రజలందరి అభిమానం తమకే లభించాలని ప్రతి పార్టీకి ఓ స్వార్థం ఉంటుందని, అయితే జనసేన ఆ పరిస్థితిని అధిగమించి రాష్ట్రం బాగుండాలని సీట్ల సర్దుబాటుకు ముందుకు వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఒక్క తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో మూడు పార్టీలు కలిశాయని వివరించారు. రాజకీయ పార్టీని నడపడం అంటే సులభమేమీ కాదని అన్నారు. తన ఒక్కడి ప్రయోజనాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల భవిష్యత్తు బాగుండాలనే తాను పార్టీ పెట్టానని వివరించారు. మంత్రి పదవి మాత్రమే కోరుకుంటే, తనకు ఆ పదవి ఎప్పుడో లభించి ఉండేదని, కానీ తనకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. అనకాపల్లి స్థానం జనసేనదే అయినప్పటికీ, బీజేపీ అధిష్ఠానం అభ్యర్థన మేరకు సీఎం రమేశ్ అభ్యర్థిత్వాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తున్నామని తెలిపారు.

“అమ్మ ఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని మాటిచ్చారు. రెండో సంవత్సరం వచ్చేసరికి రూ.1000 తగ్గించి రూ.14 వేలు చేశారు. మరో సంవత్సరం తిరిగే సరికి ఇంకో రూ.1000 తగ్గించి రూ.13 వేలు చేశారు. 2021-22లో మొత్తానికి అమ్మఒడి ఇవ్వకుండా ఎగ్గొట్టారు.

ఎంతమంది బిడ్డలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తామని చెప్పి, ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్క బిడ్డకే అమ్మ ఒడి ఇస్తామని అన్నారు. 89 లక్షల మంది లబ్దిదారులు ఉంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి ఇచ్చారు. అందుకోసం రకరకాల కారణాలు చెప్పారు. అమ్మఒడికి ఇచ్చిన నగదు రూ.19,600 కోట్లు అయితే, మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి నాన్న గొంతును సారాతో తడిపి సంపాదించింది రూ.లక్ష కోట్లు… ముఖ్యమంత్రి కాదతను… ఓ సారా వ్యాపారి, ఇక ఇసుక వ్యాపారి, భూములను కొల్లగొట్టే ఒక మోసగాడు.

నేను ఒక ఉద్యోగి కొడుకుని. సగటు జీవికి పెన్షన్ ఎంత అవసరమో నాకు తెలుసు. మేం సినీ రంగంలో ఎదిగిన తర్వాత కూడా మా నాన్న మా వద్ద నుంచి డబ్బులు తీసుకునేవాడు కాదు. ఆయన తన పెన్షన్ డబ్బులోంచి మాకు పుట్టినరోజుకు ఏవైనా కొనిచ్చేవాడు. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు వంటిది. అందుకే, మా ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కు పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తాం.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మీ ముందుకు వచ్చాను… ఏపీ ప్రభుత్వ మాజీ ఉద్యోగి కొడుకుగా ఇవాళ చెబుతున్నా… మీ పెన్షన్ పథకాన్ని మీకు అనుకూలంగా కూటమి ప్రభుత్వం తీసుకువస్తుంది. అనకాపల్లి నడిబొడ్డున నిలబడి నూకాలమ్మ సాక్షిగా మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నా…  అంటూ పవన్ భావోద్వేగాలతో ప్రసంగించారు.

Also read

Related posts

Share via