SGSTV NEWS online
Andhra PradeshCrime

అనంతలో అయ్యప్ప మాలధారుడి దారుణ హత్య

నిందితుడూ అయ్యప్పమాల ధారుడే

ఇద్దరు స్నేహితుల మద్య వివాదం
బావిలో ఉన్న వ్యక్తిపై బండరాళ్లతో దాడి

మృతి చెందిన యువకుడు.. మూడు రోజుల తర్వాత వెలుగులోకి


బుక్కరాయసముద్రం: ఇద్దరు అయ్యప్ప మాలధారుల మధ్య  ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. బుక్కరాయసముద్రం వీర భద్రకాలనీలో నివాసం ఉంటున్న జయమ్మ, ఆంజనేయులు కుమారుడు సాయి చరణ్(20) అదే కాలనీకి చెందిన ధన్రాజ్, తాడిపత్రి మండలం బుగ్గకు చెందిన సంతోష్ స్నేహితులు. చరణ్ మేజర్ కాగా, ధనరాజ్, సంతోష్ మైనర్లు.

వీరంతా అనంతపురంలోని కూరగాయల మార్కెట్లో రోజువారీ కూలి పనులకు వెళ్తున్నారు. ఇటీవల ముగ్గురూ అయ్యప్ప మాలధారణ చేశారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన సంతోష్, ధనరాజ్, చరణ్ ద్విచక్రవాహనంలో రెడ్డిపల్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో సాయి చరణ్, సంతోష్ మధ్య వివాదం రేగింది. మాటామాటా పెరిగి ఇద్దరూ ఘర్షణకు దిగారు. దీంతో ధన్రాజ్ ఇరువురినీ విడిపించి సర్ది చెప్పాడు. అనంతరం సాయి చరణ్ మరోసారి బావిలోకి దిగగా, సంతోష్ చరణ్ప బండరాళ్లు వేశాడు. తీవ్రంగా గాయపడిన సాయిచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సంతోష్ బెదిరించడంతో ధనరాజ్ భయపడిపోయాడు. అనంతరం ఇరువురు ఇళ్లకు వెళ్లిపోయారు. మూడు రోజులైనా కుమారుడి ఆచూకీ కనిపించకపోవడంతో సాయిచరణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కళ్లముందే స్నేహితుడు చనిపోవడంతో తీవ్రంగా మధనపడిన ధనరాజ్ రెండురోజుల తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు సాయి చరణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని వెంటబెట్టుకుని మంగళవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సాయి చరణ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Related posts