June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

వృద్ధురాలి దారుణ హత్య…ఆలస్యంగా వెలుగులోకి..

నెల్లూరు: ఒంటరిగా నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. మృతదేహం కుళ్లి దుర్ఘంధం వెదజల్లుతుండడంతో శనివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. స్థానిక అరవింద్‌నగర్‌లో వెంకటేశ్వర్లు కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన ఇంట్లో గతేడాది డిసెంబర్‌ నుంచి లీలావతి (60) అద్దెకు ఉంటోంది. ఆమె ఒంటరిగా ఉంటూ స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తోంది. అందరితో ఎంతో కలివిడిగా ఉండేది. తన కుమారుడు హైదరాబాద్‌లో ఉన్నాడని అందరికీ చెప్పింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె నివాసం ఉంటున్న ఇంట్లో నుంచి శనివారం తీవ్ర దుర్ఘంధం రావడాన్ని స్థానికులు గమనించి చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు.

చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ బి.అశోక్‌కుమార్‌, ఎస్సై సైదులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా లీలావతి రక్తపుమడుగులో మృతిచెంది ఉంది. మృతదేహాన్ని పరిశీలించగా తలకు బలమైన గాయమై ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఇంటికి తాళాలు వేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పోలీసులు గాలించగా మృతురాలికి చెందిన ఆధార్‌కార్డు లభించింది.

అందులో లీలావతి వైఫ్‌ ఆఫ్‌ భాస్కర్‌రెడ్డి, నియర్‌ సత్యంషాపీ ట్రంకురోడ్డు అడ్రస్‌ ఉంది. పోలీసులు సదరు అడ్రస్‌కు వెళ్లి విచారించగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు స్థానికులను విచారించగా మంగళవారం ఆమెను చివరిసారిగా చూశామని అప్పటి నుంచి ఆమె కనిపించలేదని తెలిపారు. దీనినిబట్టి హత్య జరిగి నాలుగు రోజులై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించి చిన్నబజారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హతురాలి బంధువులు, కుటుంబసభ్యుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

మృతిపై ఎన్నో అనుమానాలు
లావతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎవరైనా దుండగులు చోరీ చేసేందుకు వచ్చి హత్య చేసి పరారయ్యారా? వ్యక్తిగత విభేదాలా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనా స్థలంతోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. మృతురాలి కుటుంబ వివరాలు తెలిసిన వారు 9440796305, 8074186436 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also read

Related posts

Share via