పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. అత్తింట్లో గౌరవం దక్కలేదని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న పిల్లలను చంపేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకేసారి ముగ్గురి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
దసరా పండగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి ఆనందోత్సాహాలతో విజయదశమి వేడుకలను చేసుకున్నారు. పండక్కి ఇంటికి వచ్చిన కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అళ్లుల్లు, మనవలు, మనవరాళ్లతో ఇళ్లన్ని సందడిగా మారాయి. కాగా దసరా పండగా అందరి ఇళ్లలో సంతోషాన్ని నింపితే.. ఆ ఇంట్లో మాత్రం విషాదాన్ని నిపింది. కొండంత పండగా వారి కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. దసరా పండగ అందరికి తీపి జ్ఞాపకాలను మిగిల్చితే.. వారికి మాత్రం చేదు గుర్తులను మిగిల్చి వెళ్లిపోయింది. అత్తింట్లో గౌరవం దక్కడం లేదని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వజ్రాల్లాంటి ఇద్దరు పిల్లల పాలిట కాల యముడిగా మారాడు. ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి వారి ప్రాణాలను తీశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
దసరా వేళ ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హృదయాలను కదిలించే ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడలో చోటుచేసుకుంది. దసరా పండగ అతి పెద్ద పండగ. ఈ పండక్కి కొత్త బట్టలు కొనివ్వలేదని, మటన్ తక్కువ అయ్యిందని, మద్యం ఇప్పించలేదని, మర్యాదలు సరిగా చేయలేదని గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారి చివరకు బంధుత్వాలను కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంటారు. ఇదే రీతిలో ఓ అల్లుడు అత్తింటి వారు తనను చిన్న చూపు చూస్తున్నారని భావించి మానసికి వేధనకు గురై ఇద్దరు కుమారులను చంపేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నందివాడ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, అపర్ణ దంపతలు. వీరికి ఇద్దరు కుమారులు విఘ్నేష్ రెడ్డి, అనిరుధ్. అయితే శ్రీనివాస్ రెడ్డి ఇల్లరికపు అల్లుడిగా అపర్ణ ఇంటికి వచ్చారు. అయితే దసరా పండగను పురస్కరించుకొని అత్తింటి వారు పిల్లలిద్దరికి కొత్త బట్టలు కొనిచ్చారు. అయితే తనకు కూడా కొత్త బట్టలు కొనివ్వాలని శ్రీనివాస్‌రెడ్డి భార్య అపర్ణను, అత్తింటివారిని కోరాడు. అయితే ఇప్పుడు డబ్బులు లేవని.. ఉన్నవాటితో సరిపెట్టుకోవాలని అత్తింటి వారు చెప్పినట్లు తెలుస్తోంది. పండగ పూట తనకు కొత్త బట్టలు కొనివ్వ లేదని శ్రీనివాస్ రెడ్డి మనస్థాపం చెందాడు. ఇల్లరికం రావటంతో తనను చిన్నచూపు చూస్తున్నారని అతడు ఆవేదన వ్యక్తం చేసినట్లు బంధువులు వెల్లడించారు.
తనకు గౌరవం దక్కడం లేదని భావించి తన పిల్లలను భార్యకు దూరం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో చిన్నారులు ఇద్దరిని మాయమాటలు చెప్పి బావి వద్దకు తీసుకెళ్లాడు. తర్వాత అందులోకి తోసేశాడు. అనంతరం తానూ అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి బావి ఒడ్డున చెప్పులను గమనించి విషయాన్ని అపర్ణ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న గ్రామస్తులు, కుటుంబసభ్యులు ముందుగా పిల్లల మృతదేహాలను బయటకు తీశారు.
అనంతరం బావిలోని నీటిని పూర్తిగా తోడేసి శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. ఒకే రకమైన కొత్త బట్టలు వేసుకొని విగతజీవులుగా పడి ఉన్న ఇద్దరు చిన్నారులను గుండెలకు హత్తుకుని తల్లి అపర్ణ.. గుండెలవిసేలా రోధించింది. పిల్లలే లోకంగా బ్రతుకుతున్న అపర్ణ వారు ఇక లేరని తెలియడంతో ఆమె రోధనలు మిన్నంటాయి. ఈ ఘటన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!