కట్టుకున్నవాడు వద్దని వదిలేశాడు… అండగా ఉంటాడనుకొని నమ్మించినవాడు కాలయముడుగా మారి కడతేర్చాడు.. విషాదంగా ముగిసిన ఇద్దరు పిల్లల తల్లి కథ ఇదీ.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది..
బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. డేగరమూడి గ్రామానికి చెందిన సూరేపల్లి మేరీ (27) కి గతంలో వివాహమైంది.. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు . అయితే భర్తతో విభేదాల కారణంగా గత కొన్నేళ్లుగా తన స్వగ్రామం డేగరమూడిలో తండ్రి దగ్గర ఉంటోంది మేరి. ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంది. ఈక్రమంలో కొరిశపాడు మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన కండె ప్రసాద్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కండె ప్రసాద్ తో కలిసి ఉంటున్న మేరీ నెల్లూరుకు మకాం మార్చి రెండు సంవత్సరాలు సహజీవనం కొనసాగించింది.. వీరిద్దరి మధ్య ఏమైందో తెలియదు.. కానీ కండె ప్రసాద్ దగ్గర నుంచి వచ్చేసిన మేరీ తిరిగి తండ్రి దగ్గరే నివాసముంటోంది.
ఈ నేపధ్యంలో కండె ప్రసాద్ పలుమార్లు మేరికి ఫోన్ చేసి నెల్లూరు రమ్మని కోరాడు. అయితే, మేరీ తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఇప్పుడు రావటం కుదరదని చెప్పింది. అవసరమనుకుంటే నువ్వే ఇక్కడకు వచ్చి ఉండాలని కండే ప్రసాద్‌కు తెలిపింది. దీంతో మేరిపై అనుమానం పెంచుకొన్న కండె ప్రసాద్ గత రాత్రి గ్రామానికి వచ్చి మేరీని ఇంటి బయటకు పిలిచాడు. మేరీ బయటకు రాగానే ఆమె మెడపై రెండు చోట్ల కత్తితో డాడి చేశాడు. మేరీ పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి నిందితుడు కండె ప్రసాద్ పారిపోయాడు.
కత్తి దాడిలో తీవ్ర గాయాలపాలై, రక్తస్రావంతో పడిఉన్న మేరీని చికిత్స నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం 108లో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున మేరీ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిందితుడు కండె ప్రసాద్ కోసం గాలిస్తున్నట్లు మార్టూరు సిఐ శేషగిరిరావు తెలిపారు. మేరీ హత్యకు గురికావడంతో వృద్ధాప్యంలో చూసే దిక్కులేక ఆమె తండ్రి, ఆలనాపాలనా చూసేవారు లేక ఆమె ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాధలుగా మారారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..