November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

పోలీస్‌ పేరుతో దాష్టీకం.. మతిస్థిమితం లేని మహిళను చితక్కొట్టిన ఉన్మాది..!





ఒంగోలు బస్టాండ్ బెంచీలపై నిద్రపోతున్న ప్రయాణికులను కర్రతో కొడుతూ లేవమంటూ.. తాను హెడ్ కానిస్టేబుల్‌నని ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశాడు.


అది ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌.. అర్ధరాత్రి ఒంటి గంట సమయం.. దూర ప్రయాణాలకు వెళ్ళే బస్సులతో, ప్రయాణీకులతో ఆర్టీసీ బస్టాండ్ సందడిగా ఉంది. అదే సమయంలో బస్టాండ్‌ ఆవరణలో ఉన్న బెంచీలపై కొంతమంది పల్లెటూళ్ళకు తెల్లవారుజామున వెళ్ళే ప్రయాణీకులు నిద్రపోతున్నారు. ఆ పక్కగా మతిస్థిమితం లేని ఓ మహిళ కింద నేలపై పడుకుని కునికిపాట్లు పడుతోంది. ఇంతలో రాక్షసుడిలా ఒకడు వచ్చాడు. చేతిలోని కర్రతో రెచ్చిపోయాడు. ఇష్టమొచ్చిన రీతిలో ప్రయాణికులను చితకబాదుతూ.. దాష్టీకానికి పాల్పడ్డాడు.


ప్రయాణంకోసం వేచి చూస్తూ బెంచీలపై నిద్రపోతున్న వారిని కర్రతో కొడుతూ లేవమంటున్నాడు… తాను హెడ్ కానిస్టేబుల్‌నని ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశాడు. అదే క్రమంలో కింద నేలపై పడుకుని ఉన్న ఓ మతిస్థిమితం లేని మహిళను కర్రతో విచక్షణారహితంగా చితకబాదాడు. మతిస్థిమితం లేని ఆ మహిళ ఎందుకు కొడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ ఉన్మాది కర్రతో ఆ మహిళను గొడ్డును బాదినట్టు బాదాడు. విపరీతమైన నొప్పిని తాళలేక ఆమె అరుస్తున్న చుట్టుపక్కల ప్రయాణీకులు ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకోలేదు. అతను పోలీసునని చెప్పడంతో అంతా కళ్ళప్పగించి చూస్తుండిపోయారు..!

ఆ అభాగ్యురాలి కేకలు విని ఆ పక్కనే ఉన్న పోలీసులు రావడం, ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. తీరా పోలీసులు అతడ్ని విచారిస్తే తాను ఒంగోలు బస్టాండ్‌లోని దుకాణాల్లోని ఓ దుకాణంలో పనిచేస్తున్న నాగరాజుగా చెప్పుకొచ్చాడు. బస్టాండ్‌లో బెంచీలపై పడుకుని ఉంటే వారందరిని తరిమేస్తున్నానని జవాబిచ్చాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని ఒంగోలు ఒన్‌టౌన్‌ ఫిఎస్‌కు తరలించారు. మతిస్థిమితం లేని మహిళను నాగరాజు దారుణంగా కొడుతున్న దృశ్యాలను ఓ ప్రయాణీకుడు తన సెల్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది

Also read

Related posts

Share via