జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శనకు వచ్చిన మిత్రులకు ఊహించని విషాదం ఎదురైంది. బైక్‌పై వస్తున్న ఇద్దరిపై అదుపు తప్పిన కారు దూసుకెళ్లడంతో మహేశ్ అనే యువకుడు ప్రాజెక్టు నీటిలో గల్లంతయ్యాడు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కారులో ఉన్నవారు పరారయ్యారు. ఘటనపై సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేశ్ అతని మిత్రులు జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. మహేశ్… మిత్రుడు జానకిరాములు ఇద్దరు ఒకే బైక్ పై మిగతా ఇద్దరు వారి బైక్స్‌పై ఆదివారం సాయంత్రం జూరాల ప్రాజెక్ట్‌కు చేరుకున్నారు. సంధ్యకాలంలో జలశాయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తిలకించారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండడంతో గేట్ల వద్ద నుంచి నీటి ప్రవహన్ని చూశారు. అయితే రాత్రి కావస్తుండడంతో తిరిగి ఇళ్లకు వెళ్లాలని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా సాయంత్రం 7.05 నిమిషాలకు ప్రాజెక్టుపై నుంచి బూడిదపాడు గ్రామానికి బైక్‌లపై తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో సరిగ్గా గేట్ నంబర్ 48వద్ద ఊహించని ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి జానకీరాములు, మహేశ్ బైక్ వైపు దూసుకువచ్చింది. బైక్ డ్రైవ్ చేస్తున్న జానకీరాములుకు తీవ్ర గాయాలు కాగా ప్రాజెక్ట్‌లోకి దూకిన మహేశ్ ఆచూకీ లభించలేదు. ఇక స్థానికులు, మిగిలిన మిత్రులు గమనించి జానకీరాములును ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్నవాళ్లు అక్కడినుంచి పరారయ్యారు.
ఇక ఘటనపై సమాచారం అందుకున్న ధరూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. కారు కర్ణాటక రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. అయితే మొదట మహేశ్ ఎక్కడికి వెళ్లాడో ఎవరికి అర్థం కాలేదు. జానకీరాములు ఒక్కడే ఘటనస్థలిలో గాయాలతో పడి ఉన్నాడు. కారు వేగానికి ఎగిరి నీటిలో పడిపోయాడన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాజెక్టుపై ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ప్రమాదం జరిగిన దృశ్యాలను గుర్తించారు. కారు వేగంగా దూసుకురావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన మహేశ్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ప్రాజెక్ట్ పై నుంచి గేట్ల వైపునకు కిందకు దూకినట్లు సీసీ ఫుటేజ్ లో గమనించారు. దీంతో వెంటనే స్థానిక జాలర్లు, రెస్కూ టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇక ఘటన విషయం తెలుసుకున్న మహేశ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రాజెక్ట్ రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనస్థలికి చేరుకున్న గద్వాల్ సీఐ శ్రీనివాస్, ధరూర్ ఎస్సై వారికి సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు. ఇక సాయంత్రానికి జూరాల ప్రాజెక్ట్ వద్దకు ఎస్డీఆర్ఫ్ సిబ్బంది రంగంలోకి దిగి మహేశ్ ఆచూకీ కోసం బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి మహేష్ కొట్టుకొని పోయి ఉంటాడని ఇరిగేషన్ అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. దీంతో మహేశ్ ఆచూకీ లభిస్తే సమాచారం అందించాలని నదీపరివాహక గ్రామాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు