July 3, 2024
SGSTV NEWS
Spiritual

ఆ ఒక్కరోజు ఆలయంలో అద్భుతం.. దేవతలను పూజిస్తే పాములు ప్రత్యక్షం.. ఎక్కడంటే..



సహజంగా ఆలయానికి వెళితే విగ్రహ రూపంలో దైవ దర్శనం కలుగుతుంది. కాని కొండాలమ్మ ఆలయంలో మాత్రం విచిత్రం.. పాము రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతి యేటా ఉగాది పార్వదినాన జరిపే జాతరలో సర్ప దర్శనం అక్కడ ప్రత్యేకత. ఇంతకీ ఎక్కడ ఉంది ఆ దేవాలయం.? ఎవరా దేవతలు.? వేలాది మంది భక్తుల మధ్యలో పాముల ప్రత్యక్షం ఎలా సాధ్యం.?

ఈ విచిత్ర జాతర మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామ శివారులో జరుగుతుంది. కాకతీయుల కాలంనాటి ఆలయంలో ప్రతి ఉగాది పర్వదినాన కొండలమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు. కేవలం జాతర సమయంలో ఉగాది రోజు మాత్రమే మూడు పాములు దర్శనమిస్తాయి. ఈ దేవాలయం వెయ్యి స్తంబాలగుడిని పోలి ఉంటుంది. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలో ముగ్గురు అక్కాచెల్లెల్లు కొండలమ్మ, గారమ్మ , బాయమ్మ ఇలా ముగ్గురి పేర్లతో మూడు చెరువులు తవ్వించారట. అక్కడే గుడిని నిర్మించి కొండలమ్మ అమ్మవారిని ప్రతిష్టించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతియేటా ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు.

జాతరలో ప్రభ బండ్లతో గుడి చుట్టు ప్రదర్శనలు చేస్తారు. ఉగాది రోజున ముగ్గురు అమ్మవార్లు మూడు పాముల రూపంలో దర్శనమిస్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎప్పటిలానే ఈసారి కూడా అమ్మవారు పాముల రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సర్పాలు స్వేచ్ఛగా సంచరించి అదృశ్య మయ్యాయి. పాముల రూపంలో ప్రత్యక్షమైన అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఉగాది రోజు సర్ప దర్శనం కలిగితే కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడి భక్తుల నమ్మకం. ఉగాది నాడు రాత్రంతా జాతరలో భక్తుల కోలాహలం.. చివరి రోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. ఈ జాతరలో మహబూబాబాద్, ఇల్లందు, ఖమ్మం, బయ్యారం, డోర్నకల్‌, కామేపల్లి, కారేపల్లి ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సర్ప దర్శనం చేసుకున్నారు. కేవలం జాతర సమయంలో మాత్రమే అమ్మవారి రూపంలో పాములు భక్తులకు కనిపించి తిరిగి ఎక్కడికి వెలుతాయో ఎవరికీ తెలియదని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also read

Related posts

Share via