November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

ప్రాణాలకు తెగించి 50మంది కార్మికులను కాపాడిన పదవ తరగతి విద్యార్థి..!

వయస్సుతో సంబంధం లేకుండా.. ఆపద సమయంలో చాకచక్యంగా వ్యవహారించాడో చిన్నోడు. ఫైర్ యాక్సిండెంట్‌లో చిక్కుకున్న 50మంది కార్మికులను ప్రాణాలకు తెగించి కాపాడి ఆపద్భాందవుడయ్యాడు. హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసలు పొందాడు. అసలు కుర్రాడు చేసిన సమయస్పూర్తి ఏంటీ? అగ్ని ప్రమాదానికి కారణాలేంటీ?.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్‌ హెర్బల్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్‌ పనులు జరుగుతుండగా.. మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 300 మంది కార్మికులు ఉండగా.. ప్రాణ భయంలో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అయితే.. దట్టమైన పొగ అలుముకోవటంతో.. ఎటువెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయారు. దీంతో అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది.

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న నందిగామకు చెందిన పదవ తరగతి విద్యార్థి సాయిచరణ్‌ నేనున్నాంటూ ఆపద్భాంధవుడిలా ముందుకు వచ్చాడు. సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. అగ్నిప్రమాదంలో తనకు తెలిసిన వారు ఉన్నారన్న సమాచారం తెలుసుకుని ధైర్యంతో ముందుకెళ్లాడు. భవనంపైకి పరుగు పరుగున ఎక్కి ఫైర్ సిబ్బంది అందించిన తాడు కిటికీకి కట్టాడు. సాయి చరణ్ కట్టిన రోప్ సాయంతో చాలా మంది కార్మికులు కిందకు దిగారు. కార్మికులు సురక్షితంగా ప్రాణాలు కాపాడుకున్నారు. కార్మికుల ప్రాణాలను కాపాడిన సాయి చరణ్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వయసులో చిన్నోడైన సాయిచరణ్‌ సమస్పూర్తికి హ్యాట్సాఫ్‌ చెప్పారు పోలీసులు. రియల్‌ హీరో అంటూ స్థానికులు అభినందించారు.

అయితే అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పొగ తట్టుకోలేక కొంత మంది కార్మికులు బిల్డింగ్ మీది నుంచి కిందికి దూకారు. దీంతో ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న 5 ఫైర్ ఇంజన్లు, మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఫైనల్‌గా మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు, అసలు ఈప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

Also read

Related posts

Share via