SGSTV NEWS
Telangana

కలర్ డబ్బా ఉంటేనే లోపలికి ఎంట్రీ..! సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో వింత పనిష్‌మెంట్..!

 
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగిన ఓ విచిత్ర ఘటన ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు వింత శిక్షలతో విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు. లేటుగా వచ్చిన విద్యార్థులకు ‘కలర్ డబ్బా’ పనిష్‌మెంట్ ఇస్తున్నారు. రంగుల డబ్బా తీసుకువస్తేనే లోపలికి అనుమతి ఇస్తున్నారు. ఈ వింతైన పనిష్‌మెంట్ విధించడం తల్లిదండ్రులను ముక్కున వేలేసుకునేలా చేసింది.

తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలు ఘనంగా జరుపుకుంటారు. ఈసారి దసరా సెలవులు ముగిసిన తరువాత విద్యార్థులు పాఠశాలకు మెల్లమెల్లగా తిరిగి చేరుకోవడం ప్రారంభించారు. అయితే కొంతమంది విద్యార్థులు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం లేకపోవడమో.. లేదా ఇతర కారణాలతో కాస్త ఆలస్యంగా మంగళవారం (అక్టోబర్ 7) స్కూల్‌కి చేరుకున్నారు. ఈ విషయం ప్రిన్సిపల్ దృష్టికి వెళ్లగానే, “లేటుగా వచ్చిన ప్రతి ఒక్కరు పాఠశాల ఎదుట ఉన్న షాపులో కలర్ డబ్బా కొనుక్కొని వస్తేనే లోపలికి ప్రవేశం ఉంటుంది” అని ఆదేశించినట్టు సమాచారం. అయోమయంలో పడ్డ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ వింత ఆదేశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లలకి విద్యాబుద్ధులు బోధించాల్సిన గురువులు ఇలాంటి పనిష్‌మెంట్‌లు ఇస్తే ఎలా? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రుల సహాయంతో కలర్ డబ్బాలు కొనుక్కొచ్చి స్కూల్‌లోకి ప్రవేశించారు. ఇదే సమయంలో, పాఠశాల ఎదుట ఉన్న షాపులో ఒక్కసారిగా కలర్ డబ్బాల డిమాండ్ పెరగడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే స్థానిక విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, సోషల్ వెల్ఫేర్ అధికారులు తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు

Also read

Related posts