ఏమవుతుందో తెలియదు. సడెన్‌గా ఇళ్లకు మంటలు అంటకుంటున్నాయి. ఇలా ఒకసారి.. రెండుసార్లు కాదు.. నెలల తరబడి ఇవే ఘటనలు. దీంతో ఆ గ్రామ వాసులు హడలిపోతున్నారు. ఇప్పటికే భూత వైద్యులను సంప్రదించి.. విరుగుడు పూజలు చేశారు. అయినా మంటలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ ఇప్పుడు జోరందుకున్నాయి..
ఓ స్త్రీ రేపు రా.. ఇది జనానికి బాగా తెలిసిన మాట. కాని ఓ ఆత్మా రేపు రా అంటున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీ వాసులు. కారణం అంతుచిక్కని మంటలు అక్కడి జనానికి ఊపిరి ఆడనివ్వడం లేదు. ఇదంతా ఓ ఆత్మ చేస్తున్న పనేనని భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడి ప్రజలు. గత కొద్ది రోజులుగా కంటిమీద కునుకు లేకుండా జాగారం చేస్తున్నారు. ఎవరు కూడా తమ సమస్యను పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని మార్కండేయ కాలనీలో మళ్లీ గత కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం కురుస్తోంది. ఎవరు వేస్తున్నారో తెలియదు. ఎందుకు జరుగుతుందో అసలే తెలియదు. కానీ గత కొద్ది రోజులుగా గుడిసెలకు మంటలు అంటుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఆ కాలనీవాసులు. ఇంట్లోని సామాన్లు, ఇంటి పైకప్పు కవర్లకు మంటలు అంటుకొని కాలి బూడిదవుతున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుండి మంటలు వ్యాపిస్తాయోనని కాపలాకాస్తున్నారు ఆ కాలనీవాసులు. గత రెండు నెలల క్రితం ఇదే కాలనీలో మంటలు వ్యాపించాయి. అయితే అప్పుడు భూత వైద్యులను ఆశ్రయించి, అ ప్రాంతంలో గట్టు మైసమ్మను ఏర్పాటు చేసుకుంటే నిప్పుల వర్షం తగ్గుతుందని తెలపడంతో ఆ కాలనీలో ఆ దేవతను ప్రతిష్టించారు. తిరిగి రెండు నెలల తర్వాత మళ్లీ నిప్పుల వర్షం కురవడంతో ఆ కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ఓ ఆత్మ చేస్తున్న పని అని ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిప్పుల వర్షం కురవడంతో ఏం చేయాలో అర్థం కాక పనులకు కూడా వెళ్లకుండా ఇండ్ల చుట్టూ కాపలా కాస్తున్నారు ఆ కాలనీవాసులు.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు