November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సైబర్ ఉచ్చు కలకలం

మహబూబ్నగర్ : ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల మంది గ్రామస్తులు సైబర్ ఉచ్చులో పడిపోయారు. పెట్టుబడుల పేరుతో భారీగా లాభాలు ఆశ చూపి ఓ పే యాప్ కేటుగాళ్లు కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఒకరి నోట మరొకరు పెట్టుబడులు పెట్టించేలా చేసి ఊర్లో అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేశారు. మొదట తక్కువ మొత్తంలో లాభాలు ఆశ చూపి.. నమ్మించి ఆ తర్వాత పెద్ద మొత్తంలో దండుకుని అడ్రస్ లేకుండా పోయారు.


ఉమ్మడి పాలమూరు జిల్లాలో సైబర్ ఉచ్చు కలకలం రేపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో యువత, చిరు వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకొని కోట్ల రూపాయలు దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. మొదట ప్రతిరోజు వేలల్లో ఆదాయం చూపి తర్వాత ఒక్కోక్కరి నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టించారు. వేక్ యాప్ ద్వారా ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపించారు. బంగారు అభరణాలు కొనుగోలు చేస్తే వాటి ధరతో పాటు కొంత బోనస్ గా అదనంగా డబ్బు ఆశ చూపించారు. దీంతో ఆ డబ్బుకు ఆశపడి వందల మంది లక్షల్లో పెట్టుబడి పెట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈ తతంగం నడుస్తోంది. వనపర్తి జిల్లాలోని కడ్ కుంట్ల గ్రామంలో అయితే ఏకంగా 200మంది వరకు బాధితులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వేక్ యాప్ లో ఖాతా తెరిచిన అనంతరం ఆఫర్ నడుస్తోందని రూ.6 వేలు పెట్టుబడి పెడితే మూడురోజుల్లో రూ.24 వేలు చెల్లిస్తామని యాప్ నిర్వాహకులు ఆశ చూపారు.

దీంతో గ్రామంలో ఉన్న యువకులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కొందరైతే లక్షల రూపాయలు అప్పులు చేసి మరి డబ్బులు పంపించారు. తీరా బోనస్ లు కాదు కద డిపాజిట్ చేసిన రూపాయలు సైతం రాలేదు. నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం, అల్లీపూర్ లోనూ ఇదే వేక్ యాప్ లో ప్రజలు మోసపోయారు. అత్యాశకు పోయి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అటూ మహబూబ్ నగర్ జిల్లాలోని గండీడ్ మండలంలో వందల మంది బాధితులు ఈ సైబర్ ఉచ్చులో ఇరుక్కోని పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయారు. ఈ మొత్తం వ్యవహారం అంతా ఈజీ మనీ ఆశతోనే జరిగింది. మొదట్లో యాప్ లో అకౌంట్ తీసిన వారికి వెంటనే లాభాలు రావడంతో ఆమాట ఇంకొకరికి చేరింది. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు సైతం ఏర్పాటు చేసుకొని ప్రచారం చేసుకున్నారు. ఇలా ఒకరి నుంచి మరొకరికి పాకి ఎవరికి వారు పెద్ద మొత్తంలో డబ్బులు ఆగం చేసుకున్నారు.

ఈ రకమైన సైబర్ ఉచ్చు జరిగిన ప్రాంతాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఒక్కో గ్రామం నుంచి సుమారుగా కోట్ల రూపాయలను సైబర్ కేటుగాళ్లు దండుకున్నారు. ఇక భారీ మోసం జరగిన బాధితులు ఎవరూ కూడా పోలీసులను ఆశ్రయించకపోవడం గమనార్హం. పరువు పోతుందని బాధితులు ఎవరు ఇప్పటివరకు ఎక్కడా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఇదే తరహాలో జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లోనూ జరగుతున్నట్లు తెలుస్తోంది.

Also read

Related posts

Share via