October 16, 2024
SGSTV NEWS
CrimeTelangana

టాస్క్‌ల పేరుతో రోజువారీ కమీషన్.. అకౌంట్‌లో అమౌంట్ ఫుల్.. తీరా చూస్తే షాక్..!

ఆన్‌లైన్, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఒక వైపు అవగాహన కల్పిస్తుంటే.. మరో వైపు సైబర్ కేటుగాళ్లు మాత్రం అమాయకులను టార్గెట్ గా చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్‌లైన్ యాప్ లో పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడిన బాధితులు భారీగా డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. చివరికి చేతులు కాలాక, పోలీసులను పట్టుకుంటున్నారు..!

ఈజీగా డబ్బులు సంపాదించాలనే సామాన్యుల ఆత్యాశను.. వారికి తెలియని యాప్‌లలో పెట్టుబడులు పెట్టేలా చేస్తోంది. జనాన్ని నమ్మించేందుకు యాప్ నిర్వాహకులు కొద్దిరోజులు డబ్బులు వారి యాప్ లలో ఎక్కువ బ్యాలెన్స్ చూపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ ట్రావెల్స్ నిర్వాహకులు.. ఐఏఎస్ అనే యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ యాప్ లోని స్కానర్ల తో డబ్బులు చెల్లించి ఆందులో జాయిన్ అయ్యారు. ఈ ట్రావెల్స్ నిర్వాహకులతో పాటు మరికొందరు ఈ యాప్ లో డబ్బులు చెల్లించి జాయిన్ అయ్యారు. ఇలా వారు జాయిన్ కావడమే కాకుండా వారి కింద మరికొంత మందిని జాయిన్ చేయిస్తే ఎక్కువ కమీషన్ వస్తుందని మరికొంత మందిని అందులోకి లాగుతూ వచ్చారు.

ఈ యాప్ లో చేరాలనుకున్న వ్యక్తి మొదటగా రూ.2100లు స్కానర్ ద్వారా చెల్లిస్తే.. ఆ యాప్ వారు ఐదు టాస్క్ లు పంపిస్తారు. అవి పూర్తి చేస్తే వారికి రోజుకు ఒక్కో టాస్క్ కు రూ.15 నుండి రూ.70 వస్తాయి. అదేవిధంగా రూ.5,500 చెల్లిస్తే రోజుకు రూ.2వందలు, రూ.18,300 చెల్లిస్తే రూ.660 వస్తాయని ఐఏఎస్ యాప్ నిర్వాహకులు నమ్మించారు. కొద్ది రోజులు డబ్బులు వారి యాప్ లలో ఎక్కువ బ్యాలెన్స్ చూపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో నమ్మిన జనం ఎక్కువగా ఈ యాప్ లో జాయిన్ అయ్యారు. ఇలా ఒక్క మిర్యాలగూడ పట్టణంలోనే వెయ్యి మందికి పైగా బాధితులు డబ్బులు చెల్లించి మోసపోయారు.

ఐఏఎస్ ఆన్‌లైన్ యాప్ లో బాధితులు డబ్బులు చెల్లించిన తరువాత కొద్ది రోజులకే యాప్ ఓపెన్ కాకపోవడంతో మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. ఒకొక్కరు పట్టణంలోని ట్రావెల్స్ నిర్వాహకులను నిలదీశారు. ఆ యాప్ కు నాకు ఎలాంటి సంబంధం లేదని ట్రావెల్స్ నిర్వాహకుడు చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఆన్‌లైన్ యాప్ లను నమ్మి డబ్బులు చెల్లించొద్దని పోలీస్ శాఖ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నా కొంత మంది అదే యాప్ లను నమ్మి మోసపోతున్నారు. బాధితులు ఇప్పుడిప్పుడే ఈ యాప్ చేసిన మోసంపై పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కుతున్నారు

Also read

Related posts

Share via