November 23, 2024
SGSTV NEWS
CrimeTelangana

లోన్ యాప్ వేధింపులకు HYD యువకుడు బలి

Hyderabad: ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ ఏజెంట్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. రుణాలు తీసుకునేంత వరకు ఒకలా.. తీసుకున్నాక మరోలా ప్రవర్తిస్తున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.


గతంలో రుణాలు తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు చిటికెలో పని. ఫోనులోనే రుణాలను పొందే అవకాశం వచ్చింది. లోన్ యాప్స్‌లో ఒక్క క్లిక్‌తో అకౌంట్లలోకి డబ్బులు వచ్చి చేరుతున్నాయి. అప్పు తీసుకోవడం ఎంత ఈజీగా జరిగిపోతుందో.. తిరిగి కట్టేటప్పటికీ తల ప్రాణం తోకకు వస్తుంది. ఒక నెల లేటుగా కట్టామంటే.. ఇక లోన్ యాప్ ఏజెంట్ల ఆగడాలు ఊహించలేం. ఫోనులో భయపెట్టడం ఒక ఎత్తు అయితే.. ఇంటికి వచ్చి గొడవ చేసి..రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది మరణించారు. తాజాగా బంగారం లాంటి భవిష్యత్తు ఊహించుకున్న ఓ యువకుడు ఈ లోన్ యాప్స్ కారణంగా బలైపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.


కుత్బుల్లాపూర్‌లోని సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన 22 ఏళ్ల భాను ప్రకాష్ అనే యువకుడు ఈ లోన్ యాప్స్ వేధింపులకు బలయ్యాడు. కొంత డబ్బు చెల్లించినప్పటికీ.. హెర్రాస్ మెంట్ ఆగలేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువులో దూకి బలవనర్మరణానికి పాల్పడ్డాడు. భాను ప్రకాశ్ ప్రస్తుతం అరోరా కళాశాలలో మాస్టర్స్ చదువుతున్నాడు. డబ్బులు అవసరమై లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకున్నాడు. డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ.. యాప్ ఏజెంట్స్ అతడ్ని ఇబ్బందికి గురి చేయడంతో పాటు బెదిరించారు. దీంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు భాను ప్రకాష్. ఫాక్స్ నగర్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంట్లో నుండి వెళ్లిన కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. మొబైల్ లోకేషన్స్ ద్వారా భాను ప్రకాష్ ఆచూకీని గుర్తించారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా.. వాహనం గట్టుపై ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం మృతదేహం వెలికితీశారు. పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోన్ యాప్స్ వేధింపులు తట్టుకోలేక భాను ప్రకాష్ ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉన్నత చదువులు చదివి.. తమకు అండగా నిలుస్తాడని భావించిన కొడుకు లేకపోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు పేరెంట్స్.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via