July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

మహిళ ప్రాణాల మీదికి తెచ్చిన కోడిగుడ్డు.. హోలీ వేడుకల్లో చిందిన రక్తం

హోలీ సంబురాల్లో రక్తం చిందింది. అది కూడా ఓ కోడిగుడ్డు వల్ల. హోలీ సంబురాల్లో భాగంగా.. కొందరు తమ స్నేహితులపై కోడి గుడ్లు పగులగొడుతుంటారు. ఈ క్రమంలోనే.. ఓ వ్యక్తి తన స్నేహితునిపైకి కోడిగుడ్డు విసరగా.. అది వెళ్లి ఓ ఇంట్లో పడింది. దీంతో.. మొదలైన గొడవ.. కొడవలితో నరికేవరకు చేరుకుంది. దీంతో.. ఓ మహిళ ప్రాణాలు మీదికి వచ్చింది. ఈ ఘటన.. జగిత్యాల జిల్లాలో జరిగింది.

హోలీ.. అంటే రంగుల పండుగ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. గతంలో అయితే.. ప్రకృతిలో దొరికే పూలు, ఆకులతో రంగులు తయారు చేసుకుని వాటితో హోలీ ఆడుకునే వాళ్లు. క్రమంగా వాటిని తయారు చేసే వారు తగ్గిపోయి.. రెడిమేడ్ రంగులతో సంబురాలు చేసుకుంటున్నారు. ఇక.. కొందరు ఇంజనాయిల్, పేడ నీళ్లు, కోడిగుడ్లు, టమాటాలు ఇలా.. పిచ్చి పలురకాలు అన్నట్టుగా రకరకాలుగా హోలీ సంబరాలు జరుపుకుంటారు. అయితే.. ఎలా జరుపుకున్నా.. అది కేవలం స్నేహితుల మధ్య సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పండుగ. కానీ.. కొందరు చేసే పనుల వల్ల.. హోలీ వేడుకలు గొడవలకు దారి తీస్తుంటాయి. అలా.. ఓ కోడిగుడ్డు వల్ల గొడవ జరిగి.. అది కాస్త ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది.

జగిత్యాల జిల్లా మండలం తిప్పన్నపేట గ్రామంలో హోలీ సంబురాల్లో రక్తం చిందింది. సాధారణంగా కొందరు హోలీ సంబురాలు కోడి గుడ్లతో చేసుకుంటుంటారు. అయితే.. ఇలా కోడిగుడ్లు పగులగొట్టటం కొందరికి నచ్చుతుంది.. మరికొందరికి నచ్చదు. ఈ క్రమంలోనే ప్రకాశ్ అనే వ్యక్తి స్నేహితులపైకి కోడిగుడ్లు విసురుతుండగా.. ఓ గుడ్డు రమా అనే మహిళ ఇంట్లోకి వెళ్లి పడింది. దీంతో ఇంట్లోకి కోడిగుడ్డు విసిరింది ఎవరని రమ కుమారుడు రిషి ప్రశ్నించటంతో.. గొడవ మొదలైంది. దీంతో.. కోపోద్రిక్తుడైన ప్రకాశ్.. ఇంట్లోకి వెళ్లి రిషిపై దాడి చేశాడు.

కుమారునిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు రమ వెళ్లగా.. అక్కడే ఉన్న కొడవలి తీసుకుని ప్రకాశ్ దాడి చేశాడు. రమ మెడపై వేటు పడటంతో.. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగటంతో.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.


Also read

Related posts

Share via