July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: యూట్యూబ్‌‌తో మోటివేట్ అయ్యారు.. వీరి నైపుణ్యాన్ని చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే..!

ఆధునిక యుగంలో అంది వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం సాధారణమే. కానీ పెరుగుతున్న టెక్నాలాజీ మంచి తోపాటు చెడుపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతోంది. యూట్యూబ్‌ వారి జీవితాలనే మార్చేసింది. చోరీ వీడియోలు చూసి దొంగతనాలను నేర్చుకున్నారు. పార్కింగ్ చేసిన బైకులపై కన్నేసి మాయం చేస్తున్నారు. అయితే వీరి నైపుణ్యాన్ని చూస్తే మాత్రం వామ్మో దొంగలు బాబోయ్ దొంగలు అనేలా చేశారు. చివరికి దొంగతనాలకు పాల్పడుతూ నిందితులు కటకటలపాలయ్యారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట చెందిన తుపాకుల వెంకటేష్, గుంజి అంకమ్మ రావు, చిలకలూరి పేట మండలం కావూరు కు చెందిన ఆవుల వేణు, ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన గువ్వల శబరీష్, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జాన్‌పహాడ్ కు చెందిన మెట్టుపల్లి శ్రీకాంత్, జులాయిలుగా తిరిగేవారు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడే వారు. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. వీళ్ళందరూ జైల్లో స్నేహితులుగా మారారు.

అయితే బయటకు వచ్చాక ఈజీగా దొంగతనాలు చేసేందుకు యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. బైక్ దొంగతనాలు ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి, నేర్చుకుని బైక్ ల హ్యండీల్ లాక్ విరగ్గొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. వీరు రెండు ముఠాలుగా ఏర్పడి, తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, తిప్పర్తి, మిర్యాలగూడ, భువనగిరి, పిడుగురాళ్ల, దాచేపల్లి చిలకలూరిపేట, యెడ్లపాడు, మంగళగిరి పట్టణాలను ఎంచుకున్నారు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో, ఇంటి ముందు పార్క్ చేసిన మోటార్ సైకిల్‌లను రెక్కీ చేసి దొంగతనం చేశారు. దొంగతనం చేసే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే తమ వద్ద ఉన్న డమ్మీ పిస్టల్ తో బెదిరించేవారు. హ్యండీల్ లాక్ విరగ్గోట్టి, నెంబర్లను కూడా మార్చి పోలీసులకు దొరకకుండా ప్రయత్నం చేశారు.

ఇలా ఏపీలో దొంగతనం చేసిన బైక్ లను తెలంగాణలో.. తెలంగాణ వాహనాలను ఏపీలో అమాయకులకు తక్కువ ధరకు అమ్మేవారు. ఈక్రమంలోనే తాజాగా నల్గొండలో ఓ కానిస్టేబుల్ బైక్ ను కూడా ముఠా కొట్టేసింది. దీన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్గొండ పానగల్ బైపాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఇంటర్ స్టేట్ బైక్ దొంగల ముఠా గుట్టురట్టు అయ్యింది. ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేయడంతోపాటు 67 బైకులు, డమ్మీ పిస్టల్, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి చెప్పారు.

Also read

Related posts

Share via