SGSTV NEWS
CrimeTelangana

అమెరికా మొగుడి దొంగ బుద్ధి.. భార్యను పుట్టింటికి పంపి విమానం ఎక్కి పరార్!



US husband abandoned Hyderabad wife: వివాహం చేసుకుని జీవితమంతా సంతోషంగా జీవించాలని అనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. సమాజం గౌరవించే ఓ పోలీస్ అధికారిని పెళ్లి చేసుకుని కూడా ఆ మహిళ కష్టాలపాలు కావాల్సి వచ్చింది. నమ్మి ఒక మనిషి వెంట వెళ్లినందుకు జీవితాన్నే చీకటి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని బహుశా ఆమె ఊహించి ఉండదు. తనకు జరిగిన అన్యాయానికి ఎలాగైనా పరిష్కారం చూపించమని కనబడిన ప్రతి అధికారిని వేడుకుంది. అయినా ఫలితం లేదు. చివరికి తన సమస్యను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వరకు చేర్చాలని అనుకుంది. తన తల్లిదండ్రుల సాయంతో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లింది. అసలేం జరిగిందంటే..


హైదరాబాద్‌, సెప్టెంబర్ 17: హనా అహ్మద్ ఖాన్ అనే హైదరాబాదీ అమ్మాయి జూన్, 2022లో చికాగో పోలీసులలో పని చేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ అనే అధికారిని వివాహం చేసుకుంది. ఆ వ్యక్తి అమెరికా పౌరుడు. వివాహం తర్వాత కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ.. దాదాపు రెండేళ్ల తర్వాత కట్టుకున్న భార్యను వదిలివెళ్లిపోయాడు ఆ భర్త. దీంతో తనకు న్యాయం చేయాలని ఆ మహిళ తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ ద్వారా తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ లేఖలో మహమ్మద్ జైనుద్దీన్ మా కూతురికి చేసిన మోసం, వేధింపులకు న్యాయం చేయమని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ లక్డీకాపూల్‌ మాపుల్ హిల్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న కూతురు హనా అహ్మద్ ఖాన్‌ను యునైటెడ్ స్టేట్స్‌లోని చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అధికారిగా ఉన్న మహ్మద్ జైనుద్దీన్‌తో 2022, జూన్ 22న హైదరాబాద్‌లో వివాహం జరిపించాం. అల్లుడు స్వతహాగా అమెరికా పౌరుడు. వివాహం తర్వాత కొంతకాలం కూతురిని తమ వద్దే హైదరాబాద్‌లో ఉంచేసి తను ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఈ లోపు మా కూతురికి సంబంధించి వీసా పనులను పూర్తి చేసుకుని తనని కూడా తన భర్త దగ్గరికి పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీసా ప్రాసెస్ పూర్తవడంతో 2024, ఫిబ్రవరి 17న హనా అమెరికాకు బయలుదేరి వెళ్లింది.

ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి చికాగోలోని 6109N కెడ్‌వాలే అవెన్యూలో కొంత కాలం నివసించేవారు. కొన్నాళ్లు వీరి కాపురం బాగానే ఉన్నా ఆ తర్వాతే తమ కూతురికి సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. అల్లుడు తీవ్రంగా వేధించేవాడని, ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడని అత్తమామలు ఆరోపించారు. కూతురిని శారీరక వేధింపులు, మానసిక హింసకు గురి చేసేవాడని తెలిపారు. పరిస్థితులు చక్కబడతాయని ఆశతో ఎదురుచూసినా అల్లుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే తనకు విడాకులు ఇవ్వమని కూతురిపై అల్లుడు ఒత్తిడిచేయసాగాడు. కానీ సమాజంలో పరువుపోతుందని ఆమె విడాకులకు ఒప్పుకోలేదు. ఇంతలో కూతురికి సోషల్ సెక్యూరిటీ కార్డ్, గ్రీన్ కార్డ్ వీడియో నంబర్ 069-143-708 అందడంతో భర్త ఆమెతో రాజీ పడుతున్నట్లుగా ప్రవర్తించాడు. తన సంసారం బాగుపడుతుందని భావించింది. కానీ ఉమ్రా కోసమని ఇండియా వెళ్లాలని చెప్పి 2024, ఫిబ్రవరి 7న హైదరాబాద్ వచ్చారు. అతనికి హైదరాబాద్‌లో ఎలాంటి సొంత ఇల్లు లేకపోవడంతో సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో దిగారు.

ఎలాగో హైదరాబాద్ వరకు వచ్చాం కాబట్టి ఇక్కడే ఉన్న తన కుటుంబాన్ని కలిసి రమ్మని ఆమెను పుట్టింటికిపంపి.. గుట్టుచప్పుడుకాకుండా హోటల్‌ గదిని ఖాళీ చేసి అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం హనాకు ఫోన్‌ చేసి చెప్పారు. హోటల్‌కు తిరిగి వెళ్లేసరికి తన పాస్‌పోర్ట్, గ్రీన్ కార్డ్, SSN, వ్యక్తిగత ఆభరణాలు సహా అన్నీ ఎత్తుకుపోయినట్లు గుర్తించి మోసపోయానని గ్రహించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిని సంప్రదించి కొత్త పాస్‌పోర్ట్ తీసుకుంది. తమ కూతురికి జరిగిన అన్యాయానికి ఎలాగైనా పరిష్కారం చూపాలని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ, అతను దొంగిలించిన పత్రాలు, విలువైన వస్తువులను తిరిగి పొందడంలో ఎలాంటి పురోగతి లభించలేదు. కూతురి నుంచి అల్లుడు దొంగిలించిన పత్రాలు, విలువైన వస్తువులను తిరిగి అప్పజెప్పేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు

Also read

Related posts

Share this