July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

పెళ్లి పీటలు ఎక్కబోయే డ్రైవర్‌ను కటకటాలకు పంపిన పోలీసులు.. విషయం తెలిసి అంతా షాక్!

నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ యజమానిని బురిడీ కొట్టించి 40లక్షల రూపాయల నగదు, కారుతో పరారయ్యాడు. కొట్టేసిన నగదుతో పెళ్లి చేసుకుని బిజినెస్ పెట్టి సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని , మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. పెళ్లి పీటలు ఎక్కబోయే ఆ డ్రైవర్‌ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసుకు సంబంధించి, పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు వివరాలు వెల్లడించారు. అత్తాపూర్‌కు చెందిన వినయ్ కుమార్ గుప్త స్టీల్ వ్యాపారం నిర్వహించేవారు. అతని వద్ద రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విజేంద్ర సింగ్ ఏడాదిన్నర క్రితం కారు డ్రైవర్‌గా పనిలో చేరాడు. నమ్మకంగా పని చేస్తూ వారి ఇంటి మనిషిలాగా మెలిగాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న వినయ్ కుమార్ గుప్త రామంతపూర్ వెళ్తుండగా… దాహం వేయడంతో హైదర్‌గూడ నిలోఫర్ కేఫ్ వద్ద కారు ఆపి, వాటర్ బాటిల్ కొనేందుకు లోనికి వెళ్ళాడు.

వాటర్ బాటిల్ తీసుకువచ్చేసరికి డ్రైవర్ , కారు కనిపించకపోవడంతో కంగుతిన్న వినయ్ కుమార్ డ్రైవర్ విజేంద్ర సింగ్ నెంబర్ కు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారుతో పాటు కారులో ఉన్న రూ. 40 లక్షల నగదు ఎత్తికెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదుతో ప్రత్యేక టీమ్‌గా ఏర్పడ్డ పోలీసులు, హైదరాబాద్ , రాజస్థాన్ రాష్ట్రంలో పోలీసులు గాలించారు. ఎట్టకేలకు రాజస్థాన్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా మొదటగా డబ్బులన్ని ఖర్చు అయ్యాయని, ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులన్ని పోగొట్టుకున్నానని బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పెట్టాడు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు, దొంగిలించిన డబ్బుతో 11 లక్షల రూపాయలు పెట్టి మహేంద్ర స్కార్పియో కారు కొన్నట్లు, మిగిలిన నగదుతో బిజినెస్ పెట్టి సెటిల్ అవ్వాలని అనుకున్నట్లు తెలిపాడు. విజేంద్ర సింగ్ వద్ద నుండి 20 లక్షల 70 వేల రూపాయల నగదు , 11 లక్షలు విలువ చేసే స్కార్పియో కారు, ఓనర్ వినయ్ కుమార్ కారుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. మిగిలిన డబ్బుతో ఇన్నిరోజులు విలాసవంతంగా గడిపినట్లు ఒప్పుకున్నాడు. విజేంద్ర సింగ్‌ను అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ గిరిధర్ రావు తెలిపారు.

Also read

Related posts

Share via