SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఏంట్రా ఇలా తయారయ్యారు.. విద్యార్థిపై బీర్‌ బాటిళ్లు, కర్రలతో 20 మంది మూకుమ్మడిగా దాడి.. ఆ తర్వాత

హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు నేరాలు పెరుగుతున్నాయి.. తాజాగా.. హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ ప్రాంతం డీడీ కాలనీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ హింసాత్మక ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఓ బీటెక్ విద్యార్థి అభినవ్‌పై సుమారు 20 మంది యువకులు ముకుమ్మడిగా దాడికి దిగారు. కర్రలు, బీరు సీసాలతో అభినవ్‌పై విచక్షణ లేకుండా దాడి జరిపారు. వివరాల్లోకి వెళితే.. అభినవ్ అనే బీటెక్ విద్యార్థి తన స్నేహితుడి ఇంటిపై కొందరు యువకులు దాడి చేస్తున్నారని తెలుసుకుని అక్కడికి ఒంటరిగా వెళ్లాడు. అయితే సంఘటనా స్థలానికి చేరుకోగానే అతడిపై దుండగులు అత్యంత క్రూరంగా కర్రలు, బీరు సీసాలతో దాడి చేశారు. ఈ దాడిలో అభినవ్ తలకు బీరు సీసా బలంగా తగలడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. తలలో బీరు సీసా ముక్కలు గుచ్చుకుపోవడంతో.. ఆయనను వెంటనే మలక్‌పేట యశోదా ఆసుపత్రికి తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేశారు.


బీరు సీసా ముక్కలను శస్త్రచికిత్స ద్వారా తల నుండి తొలగించినట్లు సమాచారం. ఈ సంఘటన తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుర్గామాత నిమజ్జనాల అనంతరం జరిగింది. నిమజ్జన కార్యక్రమం ముగిసిన తర్వాత యువకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దాడికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అంబర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు దాడిలో పాల్గొన్న 20 మంది యువకులలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.



ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దాడులు జరగకుండా పోలీసు శాఖ మరింత గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత అభినవ్ కుటుంబం సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం అభినవ్ పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అంబర్‌పేట్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, మిగతా నిందితుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు

Also read

Related posts