SGSTV NEWS online
CrimeTelangana

ఓర్నాయనో ఏంట్రా ఇది.. అద్దెకు దిగి గోడకు కన్నం వేశారు.. చివరకు..భారీ స్కెచ్



మోసం చేయడం, మనది కానిది సొంతం చేసుకోవాలనే ఆశతో కొంతమంది దేనికైనా తెగిస్తున్నారు. అద్దెకు దిగి.. గదిని శుభ్రం చేసుకుంటామని మాయమాటలు చెప్పి ఇంట్లోకి వచ్చిన దుండగులు.. భారీ స్కెచ్ చేశారు.. గోడకి కన్నం వేసి షాపులో నగలు ఎత్తుకెళ్లిన ఘటన తాజాగా హైదరాబాద్ లో కలకలం రేపింది.

హైదరాబాద్ నగరం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి సోమేశ్వరీ జువెలర్స్ షాపులో 18 కిలోల వెండి చోరీ జరిగింది. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో అద్దెలకు గదులు ఇస్తారు. వివిధ పనుల నిమిత్తం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కాయకష్టం చేసుకునేవాళ్లు ఎంతో మంది ఉంటారు. అదే రీతిలో అద్దెకు ఉంటామని ఓ ఇద్దరు వచ్చి గది కావాలని అడిగితే.. అందరిలాగే ఉండి ఏదైనా పని చేసుకుంటారేమో అని నమ్మేశారు ఆ ఇంటి యజమానులు. అనుకున్నట్లుగా గది చూపించి అద్దె మిగతా వివరాలు మాట్లాడుకున్నారు. ఆ ఇంటికి ఆనుకునే సోమేశ్వరీ జువెలర్స్ పేరుతో ఓ షాపు కూడా ఉంది. ఇదే మంచి అవకాశంగా భావించి పథకం అమలు చేసుకున్నారు. షాపుకు ఆనుకుని ఉన్న ఆ షెట్టర్ రూములో అద్దెకు దిగి రాత్రికి రాత్రే గోడకు కన్నం పెట్టి షాపులో ఉన్న వెండి వస్తువులను అపహరించుకుని అక్కడి నుంచి పారిపోయారు.

ఉదయం ఎప్పటిలాగే షాపునకు వచ్చి చూసిన యజమానికి దిమ్మ తిరిగిపోయింది. షాపు గోడ పగులకొట్టి ఉండటం, షాపులో ఉన్న దాదాపు 18 కిలోల వెండి కనిపించకుండా పోవడంతో దొంగతనం జరిగిందని గ్రహించాడు. చూస్తే షెట్టర్ రూములో అద్దెకు దిగినవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షాపును పరిశీలించి, బాధితుడి వద్ద పూర్తి వివరాలు తీసుకున్నారు.


దొంగతనం ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అక్కడున్న సీసీ కెమెరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం చూస్తుంటే.. అద్దె కోసం ఇంటిని అప్పగించాలన్నా భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే అద్దె కోసం వచ్చిన ఎవరి వద్దనైనా ఆధార్ లాంటి గుర్తింపు కార్డులు అడిగి నిర్ధారించుకున్న తర్వాతే ఇంటిని ఇవ్వాలని.. ఏ మాత్రం అనుమానం కలిగినా దగ్గరలోని స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు

Also read

Related posts