హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతమైన పాతబస్తీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమావాస్య రోజు అసలు అక్కడ ఏమి జరిగింది?.. ఆ ప్రాంతంలో ప్రజలు ఎందుకు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. షాపుల ముందర నిమ్మకాయలు, బొమ్మ, కోడిపిల్ల వంటి భయాన్ని పుట్టించే సామాగ్రి ఎవరు వేసి వెళ్లారు?.. అసలు ఎందుకోసం అలా వేసి వెళ్లారు?.. ఇప్పుడు ఇలాంటి సవాలక్ష సందేహాలతో భాగ్యనగరం భయపడుతోంది. అసలేం జరిగింది..? ఏమిటా కథా కమామిషు?
పాతబస్తీ- బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహంగీరాబాద్ ప్రాంతంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అక్కడ ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. సరిగ్గా అమావాస్య రోజు ఈ ప్రాంతంలో రాత్రి 12 గంటల ఒక్క నిమిషానికి వాడిన మహిళ బట్టల్లో మంత్రతంత్రాలు చేసిన నిమ్మకాయలతో పాటు ఓ కోడిపిల్ల, ఓ బొమ్మకి సూదులు గుచ్చి ఆ మొత్తం సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళుతూ ఓ పక్క పడేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఇది తెలుసుకున్న స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ ఏరియాలో తిరగాలన్నా, అటువైపు వెళ్లాలన్నా జంకుతున్నారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారో, అసలు అలా సామాగ్రి పారవేసి వెళ్లింది ఎవరో ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది.
మామూలుగా ఊళ్లల్లో ఎక్కువగా ఇలాంటి క్షుద్రపూజలు, మంత్రాలు, చేతబడులు లాంటివి చూస్తూ ఉంటాం. కానీ, నగరంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం, వాటిని చూసి ప్రజలు భయపడడం ఇప్పుడు సమస్యగా మారింది. ఇదిలా ఉంటే, నచ్చనివారిపై చేతబడి చేయడం, శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇలా స్మశానాలలో చేతుబడులు చేయడం, సమాధుల్లో విగ్రహాలు పెట్టి మంత్రాలు చేయించడం పాతబస్తీలో మాత్రం కొత్తేమీ కాదు. టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందిన ఇప్పటి కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను ప్రేరేపించే ఘటనలు జరగడం బాధాకరం.
పాతబస్తీ ప్రాంతంలో సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను బట్టి అసలు ఎవరు ఇలా చేశారని, ఎందుకు చేస్తున్నారో కనిపెట్టలని స్థానికులు ఫిర్యాదులు చేశారు. నిందితులను గుర్తించి తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు స్థానికంగా ఉండే కెమెరాలను స్కాన్ చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా జనాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025