July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hotel Food Danger: కుళ్లిన కూరగాయాలు, కాలం చెల్లిన ఫుడ్.. కల్తీపై తెలంగాణ సర్కార్‌ సీరియస్ యాక్షన్

కల్తీ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తోంది. సర్కార్ సీరియస్ వార్నింగ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు కంటిన్యూ అవుతున్నాయి. GHMCలో మొదలైన ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సీరియస్ యాక్షన్‌ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఖమ్మం, మేడ్చల్‌ జిల్లాలోను ప్రముఖ హోటల్స్‌, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేశారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. కుళ్ళిన కబాబులు, ఎక్స్‌ఫైరీ మసాల దినుసులు సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో హోటల్స్, రెస్టారెంట్ల యాజమానులు హడలిపోతున్నారు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతన్న పేరు మోసిన రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారుల మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. గతం వారం రోజులుగా హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖ హోటల్స్‌, రెస్టారెంట్‌లపై రైడ్స్ చేసి వాటి భాగోతం బట్టబయలు చేస్తున్నారు. లోట్టలేసుకొని లాగించే ఫుడ్ ప్రియుల కళ్లు తెరిపిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్‌లో జరుగుతున్న వాస్తవి పరిస్థితిని ప్రజల కళ్లకు కడుతున్నారు. ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లపై మెరుపు దాడులు చేసి కాలం చెల్లిన ఫుడ్, వస్తువులు, నూనె సీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా మేడ్చల్‌లోని తాజా హాలిడే రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు. స్టోర్‌ రూమ్‌లో ఫుడ్‌ కలర్స్‌ గుర్తించారు అధికారులు. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు, నిమ్మకాయలు గుర్తించారు. లేబుల్‌ లేని టీపొడి, పురుగులు పట్టిన కొర్రలు సీజ్‌ చేశారు. అంతేకాకుండా వట్టినాగులపల్లి ప్రిజం రెస్టారెంట్‌, బార్‌లో తనిఖీలు చేశారు అధికారులు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు సీజ్ చేశారు. వంటగదిలో దుర్వాసన, మురుగు నీరు పేరుకుపోయినట్లు గుర్తించారు.

హైదరాబాద్‌లో స్టార్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్, ఫుడ్‌ సేఫ్టీ దాడులను తెలంగాణ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మంలోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్‌లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. రెస్ట్ ఇన్, శ్రీశ్రీ, హవేలీ రెస్టారెంట్‌లో తనిఖీలు కొనసాగించారు. విస్తుపోయే నిజాలు కళ్లకు కట్టారు. నిల్వ ఉంచిన పాచిపోయిన చికెన్‌, నాసిరకం మసాలాలు సీజ్ చేశారు. రెస్ట్ ఇన్ హోటల్లో వినియోగదారులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన చికెన్ కబాబ్ లను కాల్వలో వేయించారు ఫుడ్ కంట్రోలర్ అధికారులు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ సేకరించిన అధికారులు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

పాడైపోయిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో వేడివేడిగా వంటకాలు తయార్ చేయడమే కాకుండా.. ఎక్స్‌పైరీ అయిపోయిన ఇంగ్రీడియంట్స్‌తో బిర్యానీ రెడీ చేస్తున్నట్లు అధికారులు రైడ్స్‌లో గుర్తించారు. అంతేకాదు కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, తృణధాన్యాలు, పిండి, వాటర్ బాటిల్స్ సహా దేనిని వదలకుండా ప్రతీదాన్ని కల్తీ చేసి ఫుడ్‌ తయార్‌ చేస్తున్నారు. ఇక ఐస్‌క్రీమ్స్, కాఫీ, టొమాటో సాస్, వెజిటెబుల్ ఆయిల్స్, నెయ్యి.. ఇలా ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా.. అన్నింట్లోనూ అదే దుస్థితి కొనసాగుతోంది. రెస్టారెంట్లు, హోటళ్లు…ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో.. ప్రజల ఆరోగ్య భద్రతా ప్రమాణాల దృష్ట్యా ప్రభుత్వం సీరియస్ ఆదేశాలు జారీచేసింది. కల్తీ విషయంలో ఎంత పెద్ద వారున్న ఉపేక్షించేదే లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడుల కొరడా ఝళిపించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులతో హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో వణుకుమొదలైంది. ఏక్షణం, ఎటు వైపు నుంచి ఏ అధికారి వచ్చి రైడ్ చేస్తాడో తెలియక టెన్షన్‌ పడుతున్నారు.

Also read

Related posts

Share via