June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024CrimeLok Sabha 2024Telangana

Lok Sabha Election: తెరవెనుక మొదలైన అసలు కథ.. ఇప్పటి వరకు ఎంత సొమ్ము సీజ్ చేశారో తెలుసా?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెర ముందు రాజకీయం ముగిసింది.. తెరవెనుక అసలు కథ మొదలయింది. ఓవైపు వ్యూహాలకు పదును పెడుతూనే.. మరోవైపు పంపకాల జాతరను షురూ చేశారు నేతలు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు..తగ్గవద్దంటూ డబ్బులను పంచేస్తున్నారు. దీంతో అధికారులకు భారీగా నోట్లకట్టలు పట్టుబడుతున్నాయి. పోలింగ్‌లోనే కాదు.. పంపకాల పద్దుల్లో తెలుగు రాష్ట్రాలు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి..

ప్రచారపర్వం ముగిసింది.. ప్రలోభాల పర్వం మరింత ముమ్మరమయింది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యాన్ని ఎరవేస్తున్నారు నేతలు. అక్రమ రవాణాను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వారి కళ్లు గప్పి భారీ మొత్తాన్ని గమ్యస్థానాలకు చేరవేయిస్తున్నారు పలువురు నేతలు. విజయంలో నగదు పంపిణీదే కీలకపాత్ర కావడంతో ఎక్కడా కొరత లేకుండా చూసుకుంటున్నారు అభ్యర్థులు. మరోవైపు కొంతమంది అభ్యర్థులు రిస్క్‌లేకుండా ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లను నడిపేస్తున్నారు.

ఎలక్షన్‌ కమిషన్‌ డేగ కళ్లతో పహారా కాస్తున్నా సరే.. పంపిణీ మాత్రం జరుగుతూనే ఉంది. ధన వస్తు రూపంలోనూ ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఆ హడావుడిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటినుండి ఇప్పటివరకూ ఏపీ వ్యాప్తంగా రూ. 269 కోట్లకు పైగా నగదు, మద్యం, అభరణాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా.

ఇటు తెలంగాణలో కూడా లోక్‌సభ ఎన్నికల్లో తగ్గేదే లేదంటూ ప్రలోభాల పర్వం కొనసాగింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 320 కోట్ల రూపాయలకు పైగా నగలు, నగదు, మద్యం సీజ్‌ చేసినట్టు తెలిపారు సీఈఓ వికాస్‌రాజ్‌. ఈ మేరకు 8 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు మరింత ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

ఈ రెండు రోజుల్లో నగదు ప్రవాహం మరింత అధికమయ్యే అవకాశం ఉండడంతో నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది ఎన్నికల సంఘం. మరోవైపు నగదు పంపిణీపై సమాచారం తెలిస్తే తమకు తెలపాలను కోరుతున్నారు అధికారులు.

Also read

Related posts

Share via