SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: కత్తులతో గొంతు కోసి.. కుక్కర్‌తో కొట్టి.. ప్రాణం తీసిన పనోళ్లు.. పారిపోతున్న వీడియో వైరల్..

 

ఇంట్లో పని ఇవ్వడమే ఆ మహిళకు శాపంగా మారింది. అన్నం పెట్టిన చేతులనే నరికేశాడో దుర్మార్గుడు. డబ్బు కోసం అతికిరాతకంగా మహిళను చంపేశాడు. కత్తులతో గొంతు కోసి, కుక్కర్‌తో కొట్టి దారుణంగా హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కూకట్‌పల్లిలో జరిగింది.


పనివాళ్లే ప్రాణం తీశారు. నమ్మి పనిలో పెట్టుకుంటే మహిళ ప్రాణమే పోయింది. కూకట్‌పల్లిలో జరిగిన దారుణ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్‌పల్లిలోని స్వాన్‌ లేక్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం రేణు అగర్వాల్‌ అనే మహిళ ఆమె ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. ఈ దారుణానికి పాల్పడింది రేణు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడితో పాటు మరొకరు అని పోలీసులు అనుమానిస్తున్నారు. సనత్ నగర్‌లో స్టీల్ దుకాణం నడుపుతున్న రాకేశ్‌ అగర్వాల్, రేణు అగర్వాల్‌ దంపతులు స్వాన్‌ లేక్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. రోషన్‌ అనే యువకుడు తొమ్మిదేళ్లుగా రేణు బంధువుల ఇంట్లో పనిచేస్తున్నాడు. అతడే 11 రోజుల క్రితం జార్ఖండ్‌కు చెందిన హర్ష్‌ను రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు.

ఈ క్రమంలో హర్ష్, రోషన్ కలిసి కుట్రకు తెరదీశారు. డబ్బు కోసం కన్నింగ్ ప్లాన్ వేశారు. బుధవారం ఉదయం రాకేశ్‌, వారి కుమారుడు శుభం దుకాణానికి వెళ్లిన తర్వాత రేణు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమెను హత్య చేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. డబ్బు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలని రేణును నిందితులు చిత్రహింసలు పెట్టారు. ఆమె చెప్పకపోవడంతో కూరగాయల కత్తులతో గొంతు కోసి, తలపై కుక్కర్‌తో బలంగా కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి, అందినంత డబ్బు, నగలను సూట్‌కేసులో నింపుకుని పారిపోయారు. అంతేకాకుండా హత్య చేసిన తర్వాత రక్తపు మరకలతో ఉన్న దుస్తులను అక్కడే వదిలేసి, స్నానం చేసి కొత్త దుస్తులు ధరించారు. అనంతరం ఇంటికి తాళం వేసి, రాకేశ్‌ కుటుంబానికి చెందిన స్కూటీపై పరారయ్యారు.

సాయంత్రం 5 గంటల సమయంలో రేణుకు ఆమె భర్త, కుమారుడు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో రాకేశ్‌ ఇంటికి వచ్చి తలుపు తట్టగా లోపల నుంచి ఎవరూ తీయలేదు. దీంతో ప్లంబర్‌ను పిలిపించి వెనుక వైపు నుంచి లోపలికి పంపించారు. ప్లంబర్ తలుపు తీయగానే లోపలికి వెళ్లిన రాకేశ్‌కు హాల్లో కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ఉన్న రేణు రక్తపు మడుగులో పడి కనిపించారు. తల, శరీర భాగాలపై తీవ్ర గాయాలు ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌లో నిందితులు ఖాళీ చేతులతో లోపలికి వచ్చి, సూట్‌కేసుతో వెళ్లినట్లు రికార్డు అయింది. ప్రస్తుతం పోలీసులు నిందితులైన హర్ష్, రోషన్‌ల కోసం 5 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు

Also read

Related posts

Share this